వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉన్నదని.. జగన్ను కలవడానికి అనుమతి ఇవ్వడానికి కూడా వారు వసూళ్లకు పాల్పడుతున్నారని.. పార్టీ నాయకుల గురించి తప్పుడు సమాచారం జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తూ పార్టీ పతనం అవ్వడానికి ప్రధాన కారకులుగా నిలుస్తున్నారని.. ఆ పార్టీలో చాలా కాలంగా ఆరోపణ లు ఉన్నాయి. సహజంగా జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి కీలక వ్యక్తులుగా చలామణి అవుతున్న వారు మాత్రమే ఇలాంటి కోటరీగా ముద్రపడతారు. ఈ సిద్ధాంతం ప్రకారం చూస్తే విజయసాయిరెడ్డి కూడా జగన్ చుట్టూ ఉన్న కోటరీ అడ్డుగోడగా అనేక మంది విమర్శలను గతంలో ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయనే పార్టీ నుంచి వెలుపలికి వచ్చి జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే తాను రాజీనామా చేసినట్లుగా, వారి వలన మూడున్నరేళ్లపాటు తాను రకరకాల అవమానాలు భరించినట్లుగా సెలవిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. జగన్ చుట్టూ ఏర్పడిన కోటరీగా విజయసాయిరెడ్డి అభివర్ణిస్తున్న.. దందాలు చేస్తున్న నాయకులు ఎవరు అనేది ప్రజల్లో కీలక చర్చనీయాంశంగా ఉంది. ఈక్రమంలో విజయసాయి టార్గెట్ చేస్తున్నది ప్రధానంగా ముగ్గురు నాయకులనే అని అనుకుంటున్నారు.
ఇలాంటి అనుమానం కలిగినప్పుడు ప్రధానంగా అందరి దృష్టి సజ్జల రామకృష్ణారెడ్డి మీదకు మళ్లుతుంది. జగన్మోహన్ రెడ్డిని కూడా బైపాస్ చేయగల స్థాయిలో ఆయన ఆ పార్టీలో చక్రం తిప్పుతుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. ఒక దశలో నెంబర్ 2 స్థానం కోసం విజయసాయి- సజ్జల మధ్య తీవ్రమైన అంతర్యుద్ధం నడిచిన సంగతి కూడా పార్టీలో అందరికీ తెలిసిందే. అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. విజయసాయిరెడ్డి- కోటరీగా ఆరోపణలు చేస్తున్నది కేవలం సజ్జల గురించి మాత్రమే కాదు. జగన్ కు అత్యంత సమీప బంధువు అయిన చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి, పార్టీలో కొత్త శక్తిగా ఇటీవలే ఎదుగుతున్న చెవిరెడ్డి భాస్కర రెడ్డి గురించి కూడా.. అని విశ్లేషకులు భావిస్తున్నారు.
వై వి సుబ్బారెడ్డి కి విజయసాయి రెడ్డికి మధ్య సంబంధాలు బెడిసి ఉండవచ్చునని పలువురు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కాకినాడ పోర్టు వాటాలను ఆక్రమంగా బెదిరింపులు ద్వారా దక్కించుకున్న వ్యవహారంలో విజయసాయిరెడ్డిని సిఐడి విచారణకు పిలిచినప్పుడు ఆయన చెప్పిన మాటలు వైవీతో విభేదాలు గురించి సంకేతాలు అందిస్తున్నాయి. తన అల్లుడి వ్యాపారంలో తాను ఎన్నడూ జోక్యం చేసుకోనని అంటూనే.. వాటాలు పొందడం వెనుక కర్త కర్మ క్రియ అన్నీ తానే అయి వ్యవహారం నడిపించినది వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అని స్వయంగా పోలీసులకు విజయసాయి వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. దీని ద్వారా ఆయన వైవిని టార్గెట్ చేసినట్టే.
అదే క్రమంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇటీవల కాలంలో జగన్ అనుచరుల్లో కొత్త శక్తిగా ఎదుగుతున్నారు. కేవలం ఆయన మాట మీద పార్టీలో పలువురు ఇతర నాయకులను జగన్మోహన్ రెడ్డి చులకన చేయడం ఇటీవల కాలంలో జరుగుతున్నది. ఒకప్పుడు జగన్ తర్వాత అంతా తానే అన్నట్టుగా చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా వెనక్కు నెట్టడంలో చెవిరెడ్డి సక్సెస్ అయినట్టు చెప్పుకుంటున్నారు. సదరు చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా జగన్ చుట్టూ ఉన్న కోటరీగా తమను ఆయన దగ్గరకు వెళ్ళనివ్వడం లేదని, తమ గురించి తప్పుడు మాటలు చెబుతున్నారని విజయసాయిరెడ్డి మనసులో పెట్టుకునే మాట్లాడినట్లుగా తెలుస్తున్నది. వైసీపీని ముంచుతున్న కోటరీ సారథులెవరో మరి కొంత కాలం గడిచిన తర్వాతనైనా స్వయంగా విజయసాయిరెడ్డి పేర్లను బయట పెడతారేమో వేచి చూడాలి.
విజయసాయి ఫైర్ ఆ ముగ్గురి మీదనేనా?
Friday, March 28, 2025
