వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుతెన్నులు ఎలా ఉన్నాయంటే.. ‘‘మేం మా ఇష్టమొచ్చిన రీతిలో విచ్చలవిడిగా మాత్రమే వ్యవహరిస్తాం. మేం చెలరేగిపోతూ ఉంటాం. మేం ప్రభుత్వ ఆస్తులకు, ప్రెవేటు ఆస్తులకు కూడా నష్టం కలిగించడమే మా తీరుగా వ్యవహరిస్తాం.. కానీ బాధ్యత మాత్రం మీరు తీసుకోవాలి. మేం అలా చేయకుండా మీరు మాకు భద్రత కల్పించాలి…’’ అని అడుగుతున్నట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి యాత్రకు అనుమతులు కోరుతూ వారు పోలీసులకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో.. కొన్ని నిబంధనలు విధించడాన్ని కూడా వైసీపీ తప్పు పడుతోంది. తమకు ఎలాంటి ఆంక్షలు లేని విచ్చలవిడితనానికి అనుమతి కావాలని వారు కోరుతున్నట్టుగా ఉంది. వైసీపీ డిమాండ్ చేస్తున్న తీరు వారి బరితెగింపునకు నిదర్శనంగా కనిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే..
సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకుంది. ఈ విగ్రహం ఆవిష్కరణకు 18వ తేదీ బుధవారం నాడు వైఎస్ జగన్ వస్తారని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పోలీసుల అనుమతి కోసం లేఖ కూడా ఇచ్చారు. దరిమిలా.. పోలీసు డీఎస్పీ రెంటపాళ్ల గ్రామాన్ని కూడా సందర్శించి.. జగన్ పర్యటిస్తే అక్కడ రాగల ఇబ్బందులను కూడా అంచనావేశారు. రెంటపాళ్ల అనేది చిన్న గ్రామం. జగన్ కార్యక్రమం నిర్వహించ దలచుకున్న వీధి పది అడుగుల వెడల్పు ఉన్న అత్యంత ఇరుకైన వీధి. ఇంత చిన్న వీధిలో జగన్ భారీ జనసందోహంతో కార్యక్రమం నిర్వహించదలచుకుంటే చాలా ప్రమాదం కరం అవుతుంది. ఈ నేపథ్యంలో జగన్ తో పాటు ఎన్ని వాహనాలు వస్తాయి? ఎందరు జనం వస్తారో తెలియజేయాలంటూ జిల్లా ఎస్పీ అడిగారు. కానీ వైసీపీ నుంచి మళ్లీ లేఖ మాత్రం అందలేదు. ఈ నేపథ్యంలో జగన్ కాన్వాయ్ తో పాటు మరో నాలుగు కార్లు ఉండేలా, వందమందికి మించకుండా జనం ఉండేలా చూస్తే అనుమతి ఇస్తామని ఎస్పీ ప్రకటించారు. అదే సమయంలో.. ఆ ఇరుకైన వీధిలో కాకుండా.. గ్రామ శివార్లలో సభలాగా కార్యక్రమం నిర్వహించుకుంటాం అంటే.. ఎంతమంది జనం వచ్చినా అనుమతి ఇస్తామని, భద్రత కల్పిస్తామని, అయితే.. ఎలాంటి అవాంఛనీయసంఘటనలు జరిగినా బాధ్యత తీసుకునేలా లేఖ ఇవ్వాలని ఎస్పీ అన్నారు.
ఇలాంటి నిబంధనలు విధించడమే పాపం అన్నట్టుగా వైసీపీ రెచ్చిపోతున్నది. జగన్ ఇంట్లోంచి అడుగు బయటపెడితే చాలు మహానాడుకు వచ్చిన దానికంటె ఎక్కువ మంది జనం వస్తారని, అలాంటిది వందమందికి మించి రావడానికి వీల్లేదని అనడం తప్పు అని రెచ్చిపోతున్నారు. పైగా అవాంఛనీయ సంఘటనలకు బాధ్యత వహించలని అనడాన్ని కూడా తప్పు పడుతున్నారు.
జగన్ గత పర్యటనల్లో అవాంఛనీయ పరిణామాలు ఎలాజరిగాయి? పాపిరెడ్డి పల్లిలో హెలికాప్టర్ ను విధ్వంసం చేసినదైనా, పొదిలిలో పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరచినదైనా వైసీపీ కార్యకర్తలే అనేది గుర్తుంచుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలకు బాధ్యత తీసుకోవాలంటే.. వైసీపీ నేతలు ఎందుకు గుర్రుమంటున్నారో అర్థం కావడం లేదు. అంత ఇరుకువీధిలో సభ నిర్వహిస్తే.. తొక్కిసలాట జరిగితే ప్రమాదం వారికే కదా.. ఆ మాత్రం విచక్షణ లేకపోతే ఎలా అనేది పలువురి మాటగా ఉంది. నిబంధనలు ఉల్లంఘించడమే లక్ష్యంగా, ఏదో ఒకరీతిగా సర్కారు మీద బురద చల్లడమే లక్ష్యంగా వ్యవహరిస్తే వైసీపీ పరువే పోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
బాధ్యత వహించాలని అడగడం కూడా తప్పేనా?
Friday, July 11, 2025
