మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందా? ప్రజాప్రతినిధుల చట్టంలోని నిబంధనలు ఇలాంటి అనివార్యమైన పరిస్థితిని కల్పించబోతున్నాయా? ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న పార్టీకి నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని కోల్పోతారా? అలాంటి అవకాశాలను కొట్టిపారేయలేం అని అనుకోవాల్సి వస్తోంది. ఏపీ డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు మాటలు గమనించినప్పుడు.. జగన్ మీద వేటు తప్పదని అనిపిస్తోంది.
రఘురామరాజు ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఒక సంగతి చెప్పారు. వరుసగా 60 రోజుల పాటు శాసనసభకు రాకపోతే గనుక.. శాసనసభ్యత్వం ఆటోమేటిగ్గా రద్దవుతుందని ఆయన అన్నారు. ఇది జగన్ కు ప్రమాద ఘంటికే అని చెప్పాలి. ఎమ్మెల్యేగిరీ నిలబెట్టుకోవాలంటే.. కనీసం 60రోజుల వ్యవధిలోగా సహేతుక కారణాలతో సెలవు చీటీ పెట్టి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు గనుక.. అసెంబ్లీకి రాను అని ప్రకటించి తొలినుంచి దూరంగానే ఉంటున్న జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు పడే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. పులివెందుల స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వనందున అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం అనేది తాను సాగిస్తున్న పోరాటం అని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి.. పదవిని కాపాడుకోవడం కోసం ఒక మెట్టు దిగివచ్చి.. సెలవుచీటీ పంపుతారని అనుకోవడం భ్రమ. దీనికి ఒక ఉపాయం ఉంది. అసెంబ్లీకి వచ్చి రిజిస్టరులో సంతకం పెట్టి.. సభకు హాజరుకాకుండా వెళ్లిపోవడానికి అవకాశం ఉంది. ఆ విషయం కూడా రఘురామ ప్రస్తావించారు. అలా చేయడం వల్ల.. జగన్ తన ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడం సాధ్యం అవుతుంది గానీ.. ఆ పదవికోసం ఆయన తన ప్రతిజ్ఞ విషయంలో చాలా మెట్లు దిగజారినట్టు అవుతుందని కూడా రఘురామ గుర్తు చేస్తున్నారు.
ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చట్టంలోని నిబంధనల్ని ప్రయోగించదలచుకుంటే.. జగన్ మీద అనర్హత వేటు పడడం గ్యారంటీ. దాని పర్యవసానంగా పులివెందుల స్థానానికి తప్పకుండా ఉప ఎన్నిక వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి గండం గట్టెక్కడానికి జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
పులివెంందుల ఎమ్మెల్యేకు ఉపఎన్నిక తప్పదా?
Sunday, February 16, 2025
