డబ్బు తిన్నావంటే.. లిక్కర్ తాగను- అంటాడేంటో!

Friday, July 11, 2025

చెవిరెడ్డి భాస్కర రెడ్డి చెబుతున్న కొన్ని మాటలు అచ్చంగా నిజాలనే అనుకుందాం. వ్యసనాల విషయంలో ఆయనంతటి అద్భుతమైన వ్యక్తి మంచివాడు ఎవ్వరూ ఉండరనే అనుకుందాం. పుట్టి బుద్ధెరిగిన తర్వాత.. ఆయన ఇప్పటిదాకా మందుచుక్క రుచిచూడలేదనే అనుకుందాం.. లిక్కర్ వాసన కూడా పడనంతటి బుద్ధిమంతుడు అనే మాటను కూడా విశ్వసిద్దాం.. ఆ కోణాల్లోంచి ఆయన క్లెయిం చేసుకుంటున్న ప్రతిమాటను కూడా ఒప్పుకుందాం. కానీ.. ఇలాంటి వ్యవహారాలకు ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో జగన్ సర్కారులోని పెద్దలు కోట్లాదిరూపాయలు కాజేసి పంచుకున్నారని ఆధారాలతో సహా తేల్చి నడుస్తున్న కేసుకు ఏంటి సంబంధం? లిక్కర్ వాసన ఎరగని వ్యక్తికి, డబ్బు వాసన కూడా పడకుండా ఉంటుందా? లేదా.. లిక్కర్ కుంభకోణంలో కాజేసిన సొమ్ము కూడా లిక్కర్ వాసన కొడుతూ ఉంటుందని.. కాబట్టి ఆ సొమ్ము జోలికి తాను వెళ్లనని ఆయన చెప్పదలచుకున్నారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

వైఎస్ జగన్ పాలనలో.. దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా అభివర్ణించదగిన స్థాయిలో లిక్కర్ స్కామ్ చోటు చేసుకుంది. మద్యం తయారీదార్లనుంచి ఏకంగా మూడున్నరవేల కోట్ల రూపాయలు కాజేశారు. వివిధ రూపాల్లోకి ఆ సొమ్మును మళ్లించారు. వైఎస్ జగన్ స్వయంగా రాజ్ కెసిరెడ్డితో.. పార్టీకి నిధులు దండిగా కావాలని, తదనుగుణంగా చేయాలని పురమాయించి.. కొత్త లిక్కర్ పాలసీని దోపిడీకి వీలుగా తయారుచేయించినట్టు కూడా పోలీసులు విచారణలో తేల్చారు. అయితే.. వ్యాపారులనుంచి రాజ్ కెసిరెడ్డి ఈ సొమ్ములు వసూలు చేసిన తర్వాత.. వాటిని ఆయననుంచి తీసుకుని.. ఇతర అవసరాలకు మళ్లించడం వంటి పనులను వైసీపీ కీలక నాయకులు, జగన్ కీలక అనుచరులు అందరూ పంచుకున్నారు. వారిలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా ముఖ్యులు.

ప్రారంభంలో లిక్కర్ పాలసీ రూపకల్పన నాటినుంచి చక్రం తిప్పుతున్న వారిమీదనే అనుమానంతో కేసులో నిందితుల నమోదు, విచారణ పర్వాలు ప్రారంభం అయ్యాయి. తర్వాత క్రమంగా.. వెల్లడవుతున్న వాస్తవాల్ని బట్టి నిందితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అసలుఈ మొత్తం కుంభకోణంలోనే.. తొలినుంచి యాక్టివ్ గా కాకపోయినప్పటికీ.. వసూలైన డబ్బు కట్టలు అన్నీ ఒక చోట నిల్వ చేసిన తర్వాతి దశలోనే.. చెవిరెడ్డి పాత్ర ఈ స్కామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి డబ్బులను సంచుల్లోను, లారీల్లోనూ తరలించడం ఆయన పనిగా మారింది. అందుకు తన అనుచరులను ఆయన వాడుకున్నారు. జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడు కావడంతో  లిక్కర్ డబ్బులు తీసుకెళ్లి.. ఎన్నికల కేండిడేట్లకు పంచిపెట్టారని ఆరోపణలున్నాయి. అలా తరలిస్తున్న క్రమంలోనే ఎనిమిదిన్నర కోట్లు పోలీసులకు దొరికాయి. అంతా బాగానే ఉంది.. లిక్కర్ కుంభకోణం కాజేసిన డబ్బు సంగతులు చెప్పమంటే.. నాకు లిక్కర్ తాగే అలవాటు లేదని చెవిరెడ్డి చెప్పడమే మహా కామెడీగా ఉంది. ఆయనకు అలవాటు లేకపోయినా సరే.. ఎన్నికల్లో లిక్కర్ గానీ, డబ్బు గానీ పంచలేదని కూడా ఆయన పదేపదే చెప్పుకోవడం మరింత కామెడీగా ఉంది. ఇంతకూ ఆయనకు పోలీసుల ప్రశ్న అర్థం కావడంలేదా, తాను మహానుభావుడిని అన్నట్టుగా ఆయన బిల్డప్పుల కోసం నటిస్తున్నారా? అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles