తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్ష బాధ్యతలను సాధారణంగా ఎవ్వరైనా సరే.. ఒక దైవకార్యంగా భావిస్తారు. బోర్డు అధ్యక్షుడు కాదు, బోర్డు సభ్యుడు అయినా చాలు జీవితం ధన్యమైనట్టే అనుకునేవారు బోలెడు మంది ఉంటారు. కానీ.. అలాంటి దైవకార్యం తనకు దక్కితే.. అడ్డగోలుగా దానిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూసేవాళ్లు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ఒకడే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి ఎమ్మెల్యేగా ఉంటూ.. టీటీడీ బోర్డు అధ్యక్ష పదవిని కూడా జగన్ ద్వారా దక్కించుకున్నారు ఆయన! తీరా ఎన్నికల ఫలితాల్లో జగన్ పార్టీ దారుణ పరాజయం పాలయ్యేసరికి.. తన పదవిని ప్రభుత్వం రద్దు చేసేవరకు ఆగకుండా, కిమ్మనకుండా రాజీనామా చేసేశారు.
భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే గా ఉంటూ చాలా పెద్ద స్థాయిలో అవినీతి ఆరోపణలు మూట కట్టుకున్నారు. తిరుపతి పరిసరాలలో ఉండే వందల కోట్ల విలువైన భూములను తన బినామీల పేరుతో వైసీపీలోని కొందరు పెద్దల పేరుతో కబ్జా చేశారని ఆరోపణలు స్థానికంగా వినిపిస్తుంటాయి. మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు ఓట్లు పడవని ముందే గ్రహించిన కరుణాకర్ రెడ్డి, ఈ ఎన్నికలలో తన కొడుకు డిప్యూటీ మేయర్ గా ఉన్న అభినయ రెడ్డిని బరిలోకి దించారు. కొడుకుకు టికెట్ ఇచ్చేలా జగన్ నుంచి హామీ తీసుకున్న తర్వాత, ఆయన మీద ఒత్తిడి తెచ్చి తనకు చివరి అవకాశం కావాలంటూ టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ పదవిని పుచ్చుకున్నారు.
బోర్డు అధ్యక్ష పదవి దక్కిన తర్వాత దేవుడి సేవలో తరించాల్సిన దానికి బదులుగా.. ఆ పదవిని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి కరుణాకర్ రెడ్డి శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. తిరుపతి నగర అభివృద్ధి కోసం టీటీడీ నుంచి ప్రతి ఏటా వార్షిక బడ్జెట్లో పది శాతం కేటాయించేలా ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు. దీనిపై రాష్ట్రమంతా గగ్గోలెత్తిపోయింది. దేవుడు సొమ్మును- జగన్ సర్కారుకు దోచిపెట్టడానికి కరుణాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు వినిపించాయి. ఆయన దానిని సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రభుత్వం భయపడింది. అలా టీటీడీ నిధులు ఇచ్చినా తాము తీసుకోబోమని జగన్ సర్కారు ప్రకటించింది. కొడుకు అభినయ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది గనుక.. తిరుపతి నియోజకవర్గంలో టీటీడీ ఉద్యోగుల ఓట్లు కీలక భూమిక పోషిస్తాయి కనుక.. తాను చైర్మన్ గా ఉంటూ ఆ ఉద్యోగులకు అనేక వరాలు కురిపించారు కరుణాకర్ రెడ్డి. కానీ అవేమీ కూడా ఫలితం ఇవ్వలేదు. ఆయన కొడుకు అభినయ్ ఎమ్మెల్యేగా గెలవలేదు.
తీరా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతున్న తరుణంలో భూమన కరుణాకర్ రెడ్డి ముందుగానే తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక వారు పదవి నుంచి తొలగిస్తే ఎదురయ్యే అవమానాన్ని ఆయన ఆ రకంగా తప్పించుకున్నారు అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
దేవుణ్ని దోచి జగన్ కు పెట్టాలనుకుంటే.. అంతే మరి!
Wednesday, September 18, 2024