ఎన్నికల సమరం వంటి సందర్భాలు వచ్చినప్పుడు.. ప్రతిపక్షాలను విమర్శించాలని అనుకున్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డి మహాభారతం ప్రస్తావన తీసుకువస్తూ ఉంటారు. తాను అర్జునుడినని, ఒంటరిగా పోరాడుతున్నానని, కౌరవులు అందరూ జట్టు కట్టి తనమీద యుద్ధం చేస్తున్నారని.. ఎన్నటికైనా ధర్మమే గెలుస్తుందని.. ఆయన రకరకాల నీతి వాక్యాలు చెబుతూ ఉండేవారు! కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, ‘ఆయన గుర్తుచేసుకోవలసినది మహాభారతాన్ని కాదు రామాయణాన్ని’ అని మనకు అర్థమవుతుంది. రామాయణ ఘట్టం ఆయన ప్రస్తుత పరిస్థితికి అతికినట్టుగా సరిపోతుంది. సొంత చెల్లెలు శత్రువుగా మారిన నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలక సహాయకుడు, వ్యూహకర్త, వ్యవహార నిపుణుడిగా అండదండగా ఉన్నటువంటి ముఖ్యనేత విజయసాయిరెడ్డి.. జగన్ దళానికి రాజీనామా చేసి, చెల్లెలు షర్మిల చెంతకు చేరుతున్నారా? అనే అభిప్రాయం ప్రజలలో కలుగుతోంది. ఈ ఘట్టం రావణాసురుడిని విడిచి సొంత తమ్ముడు విభీషణుడు శత్రువైన రాముడి పక్షంలో చేరిన ఘట్టానికి కొంత సరిపోలుతుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు!
జగన్ – షర్మిల కుటుంబ తగాదాలు రచ్చకెక్కిన తర్వాత.. జగన్మోహన రెడ్డికి మద్దతుగా గళం వినిపించిన భజనపరులైన నాయకుల్లో వేణుంబాక విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఆయన తన రాజకీయ సన్యాసాన్ని కూడా ప్రకటించారు. సన్యాసం ప్రకటించగానే ఆయనకు జ్ఞానోదయం అయినట్టుంది. ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని షర్మిల ఆయనకు హితోపదేశం చేసిన నేపథ్యంలో– నేరుగా వెళ్లి ఆమెతోనే భేటీ అయ్యారు. హైదరాబాదులోని షర్మిల ఇంటికి వెళ్లి, మూడు గంటల పాటు రాజకీయ చర్చలు సాగించారు. అక్కడే విందు కూడా ఆరగించారు.
‘ఇక రాజకీయాలు పూర్తిగా మానుకొని వ్యవసాయం చేసుకుంటాను, రైతుగా మాత్రమే జీవిస్తాను’ అని విజయసాయి రెడ్డి ప్రకటించారు గానీ, ఆ వైరాగ్యం పాటించడం అంత సులభం కాదు. ఆయన తాజాగా జగన్ మీద అలుపెరగని యుద్ధం సాగిస్తున్న షర్మిల అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రంగా చేరుతారా? అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. జగన్ పార్టీ స్థాపించి, దానిని విస్తరింపజేసి ఈ స్థాయికి తీసుకురావడంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అనే అడ్వాంటేజీతో పాటు విజయసాయిరెడ్డి వంటి నెంబర్ టూ ల ఆసరా ఆయనకు ఎంతో ఉపయోగపడింది. ‘వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ’ అనే అడ్వాంటేజ్ షర్మిలకు కూడా ఉంటుంది. కానీ ఆ షర్మిలను ఆ మైలేజీని పద్ధతిగా వాడుకోవడానికి అవసరమైన తెలివితేటలు అక్కడ కరువయ్యాయేమో? ఇప్పుడు ఆ తెలివితేటలకు కేంద్ర బిందువైన విజయసాయిరెడ్డి ఆమె పక్షాన చేరితే జగన్ కు మరింత ఇబ్బందులు తప్పవని, ఆయన పరిస్థితి దబిడి దిబిడే అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.