మద్యం కుంభకోణం వ్యవహారాలను మొత్తం నిగ్గు తేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం వ్యూహాత్మకంగా, వేగంగా అడుగులు వేస్తుండగా.. అదే సమయంలో.. ఆ కేసులోని నిందితులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇప్పటిదాకా అరెస్టు అయిన వారి గోడు ఒకటి కాగా.. ఎప్పుడు అరెస్టు అవుతామో అర్థంకాని స్థితిలో ఆందోళన చెందుతున్నవ వారు అనేకులు. ఈ కేసులో కొత్తగా నిందితుల జాబితాలోకి వచ్చిన జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి ఐఏఎస్ ధనంజయ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరక్టర్ గోవిందప్ప బాలాజీల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. ఈనెల 13 వ తేదీలోగా వారి అరెస్టు కూడా తథ్యం అని, వారి కోసం పోలీసులు ఇప్పటికే గాలింపు మొదలుపెట్టారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
3500 కోట్ల రూపాయలకు పైగా ముడుపులు కాజేసిన లిక్కర్ కుంభకోణంలో ఏ1 కెసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి విచారించిన తర్వాత.. వాంగ్మూలంలోని వివరాలను బట్టి.. ప్రతినెలా 50-60 కోట్ల రూపాయల వాటాలను ముడుపులుగా వసూలుచేసేవారని, వాటిని ఈ ముగ్గురి చేతికి అందించే వారని తేలింది. మరోవైపు ఆ ముగ్గురూ ఇటు హైకోర్టులోనూ, అటు సుప్రీం కోర్టులోనూ ఏకకాలంలో ముందస్తు బెయిలు కోసం పిటిషన్లు వేసుకున్నారు. ఈలోగా.. ఆ ముగ్గురూ కేసు నిందితుల జాబితాలోకి కూడా చేరారు.
బుధవారం నాడు హైకోర్టు వారి ముందస్తు బెయిలు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అయితే హైకోర్టులో తేలేదాకా ఇక్కడకు రావొద్దని గతంలో చెప్పిన సుప్రీం కోర్టు.. తాజాగా హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో బెయిలు కోసం కొత్తగా పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ఈనెల 13కు వాయిదావేసింది. కనీసం అప్పటిదాకా అయినా తాము అరెస్టు కాకుండా రక్షణ కల్పించాలని వారు కోర్టుకు విన్నవించుకున్నారు గానీ..సుప్రీం పట్టించుకోలేదు. మీరక్షణ మీరే చూసుకోవాలని చెప్పేసింది. దాంతో ఆ ముగ్గురిలో కూడా అరెస్టు భయం మొదలైంది. జగన్ సర్కారు దోపిడీకి అనుకూలంగా కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పన చేయడం దగ్గరినుంచి.. అంతిమలబ్ధిదారు కోసం వారి తరఫున ముడుపులు స్వీకరించడం వరకూ వీరు కీలకంగా వ్యవహరించినట్టు సిట్ తేల్చింది.
మరోవైపు సిట్ అధికారులు విజయవాడలోని ఐఎఎస్ ధనంజయరెడ్డి, అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి లతో పాటు అప్పటి జగన్ వ్యక్తిగత కార్యదర్శి కెఎన్ఆర్ నివాసాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. వారి ఇళ్లలో పోలీసులకు ఎలాంటి కొత్త ఆధారాలు దొరుకుతాయనే సంగతి పక్కన పెడితే.. ఈ ముగ్గురు నిందితులకు ఎటూ కోర్టుద్వారా అరెస్టు నుంచి రక్షణ కూడా లేనందున… 13 వ తేదీలోగా వారిని కూడా అరెస్టు చేసి విచారించే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.
వేట షురూ: 13లోగా మరో మూడు అరెస్టులు!
Wednesday, May 14, 2025
