తమిళ నటుడు విశాల్ ఇటీవల తలెత్తిన అస్వస్థత కారణంగా వార్తల్లోకి వచ్చారు. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సమయంలో అకస్మాత్తుగా వేదికపై స్పృహ తప్పి కింద పడిపోయారు. ఈ సంఘటనను చూసిన వారందరూ కంగారుపడ్డారు. వెంటనే వైద్య సాయం అందిస్తూ ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.
విశాల్ ఇలా స్పృహ తప్పిపోవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆరోగ్యపరిస్థితిపై సమాచారం తెలుసుకోవాలనే ఆసక్తి చూపారు. గతంలోనూ ఆయన కొన్నిసార్లు అస్వస్థతకు గురయ్యారు కాబట్టి, ఈసారి ఏమైందా అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చగా మారాయి.
తాజాగా విశాల్ మేనేజర్ స్పందిస్తూ, మద్యాహ్నం భోజనం మిస్ కావడంతోనే ఆయనకు తలనొప్పి వచ్చి స్పృహ కోల్పోయినట్టు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని తెలిపారు. డాక్టర్లు భోజనాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలని సూచించారని చెప్పారు.
ఇప్పుడు విశాల్ ఆరోగ్యం సర్వసాధారణంగానే ఉందని తెలియడంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.