తిరుమల వేంకటేశ్వర స్వామి వారికి.. ఆర్జిత సేవలకు, నిత్య కైంకర్యాలకు అవసరమయ్యేవి ఏమైనా ఉంటే.. ఆ అవసరం మొత్తం మోతాదును ఉచితంగా.. తమ తమ సంస్థల నుంచి సరఫరా చేయడానికి చాలా మంది వ్యాపారులు ముందుకు వస్తూ ఉంటారు. కొన్నింటికి మాత్రం టీటీడీ టెండర్లు పిలుస్తుంటుంది. అలాంటిది.. ఆ టెండర్లను దక్కించుకుని.. అడ్డదారిలో డబ్బులు బొక్కడానికి తప్పులు చేసేవారిని ఏం అనాలి? తిరుమల వేంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డూను కల్తీ చేసిన తయారీదారుల్ని సిట్ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి న్యాయమూర్తి ప్రస్తుతానికి రిమాండు విధించారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారుచేసేందుకు నెయ్యి టెండరు పొందిన తయారీదారులు అత్యంత హేయంగా కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంగతి. నాణ్యత గురించి పరీక్షలు చేసినప్పుడు జంతువుల కొవ్వు, ఇతర వ్యర్థాలు ఈ నెయ్యిలో కల్తీ అయినట్టు గుర్తించారు. ఆ విషయం బయటకు రావడంతో.. నానా రాద్ధాంతం అయింది. పవన్ కల్యాణ్.. పశ్చాత్తాప దీక్ష కూడా చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో టీటీడీ ఛైర్మన్లుగా ఉన్నవారు.. నెయ్యి సరఫరాలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడం వల్లనే.. ఈ తరహాలో.. నెయ్యి కల్తీ జరిగినట్టుగా నిగ్గు తేల్చారు.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటుచేసింది. అయితే.. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో.. ఒక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని వారు నియమించారు. ఆ సిట్ పలు విడతలుగా విచారణ సాగించింది. మొత్తానికి నలుగురిని అరెస్టు చేశారు. నెయ్యి కాంట్రాక్టు పొందిన తమిళనాడు దిండిగల్ లోని ఏఆర్ డెయిరీ కాంట్రాక్టు దక్కించుకుంది. అయితే శ్రీకాళహస్తిలోని వైష్ణవి డెయిరీ నుంచి, ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ వారినుంచి నెయ్యి తెప్పించుకున్నట్టుగా గుర్తించారు. భోలేబాబా డెయిరీ యజమానులు విపిన్ జైన్ పొమిల్ జైన్, శ్రీకాళహస్తి వద్దగల ఏఆర్ డెయిరీ ఎండీ అపూర్వ చావడా, ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్ ఉన్నారు. వీరికి ఈనెల 20 వరకు న్యాయమూర్తి రిమాండు విధించారు.
విచారణ సందర్భంగా వీళ్లు సూటిగా సమాధానాలు చెప్పకుండా నీళ్లు నమలడం మాత్రమే కాకుండా.. ఆధికారులను బుకాయించేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. నిజానికి ఏ ఆర్ డెయిరీ కాంట్రాక్టుతో కల్తీ నెయ్యిని ఉత్తరాఖండ్ నుంచి తెప్పించిన వైనం.. సాక్ష్యాల సహా వెలుగుచూసింది. ఆధారాలను ఎదుటపెట్టి.. నిందితులను ప్రశ్నించడంతో.. వారు ఇక మాట్లాడలేకపోయారని సమాచారం. దాంతో.. ఆ నలుగురిని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. వీరిని మరింత విచారిస్తే.. కల్తీనెయ్యి పాపంలో తెరవెనుక సూత్రధారులందరూ వెలుగులోకి వస్తారని ప్రజలు భావిస్తున్నారు.
శ్రీవారికి ద్రోహం తలపెట్టిన వారికి అరదండాలు!
Thursday, March 20, 2025
