హిందూ ధర్మానికి చెందిన ధార్మిక సంస్థల్లో ప్రత్యేకించి ఆలయాల్లో ఏరకం విధులు నిర్వర్తించడంలో అయినా సరే.. హిందువులే పనిచేస్తుంటేనే శోభిస్తుంది. ఇతర మతస్తులు హిందూ ఆలయాల్లో పనిచేయడం ఎబ్బెట్టుగా ఉంటుంది. పైగా.. మతపరమైన నిష్ట నియమాల విషయంలో వారి ధోరణులు సాంప్రదాయాల్ని మంటగలుపుతూ ఉంటాయి కూడా.
ఉద్యోగి రూపంలో ఉన్నతరువాత.. వారిని అడ్డుకోడానికి వీలుండదు. ఇలాంటి అనేక అపభ్రంశపు విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో.. హిందువులు కాని, ఇతర మతాలను అనుసరించే ఉద్యోగులను తొలగించాలనే డిమాండ్ చాలా కాలంనుంచి ఉంది. అయితే.. ఎట్టకేలకు బిఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత.. ఈ డిమాండుకు మోక్షం లభించింది.
హిందూయేతర ఉద్యోగులపై వేటు తప్పదని బిఆర్ నాయుడు తనకు టీటీడీ ఛైర్మన్ పదవిని ప్రకటించిన నాటినుంచి స్పష్టం చేస్తున్నారు. ఇతర మతాల ప్రార్థన స్థలాల్లో హిందువులకు అవకాశం లేనప్పుడు.. టీటీడీలో ఇతర మతస్తులను అనుమతించేది లేదని.. ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలకు తావులేదని ఆయన తేల్చి చెప్పారు. ఇన్నాళ్ల తర్వాత.. అప్పటి ప్రకటనకు కార్యరూపం ఇచ్చారు. టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఇతరమతస్తులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
వీరిని అవకాశాలను బట్టి.. ఇతర ప్రభుత్వ శాఖలలో ఎడ్జస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారని.. లేదా వీఆర్ఎస్ తీసుకుంటే చెల్లింపులు మొత్తం పూర్తిచేస్తాం అని ప్రకటించారు.
హిందూమతాన్ని ఒక ముసుగులాగా ధరించి ఉద్యోగం చేజిక్కించుకోవడం, ఒకసారి ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత.. తాము వాస్తవంగా పాటించే ఇతర మతాల సాంప్రదాయాలతో కొనసాగడం అనేది చాలా మందికి ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పటినుంచి కూడా.. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక కూడా తిరుమలలో అన్యమత ప్రచారాలు జరుగుతున్నట్టుగా అనేక వార్తలు వచ్చాయి. అలాంటి వారికి టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్తులే సహకరించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.
అందుకే అన్యమతస్తులను టీటీడీ నుంచి తొలగించాలని ఎన్ని డిమాండ్లు వెల్లువెత్తినా.. జగన్ వాటిని పట్టించుకోలేదు. జగన్ కళ్లలో ఆనందం చూడడంకోసమే నిర్ణయాలు తీసుకునే టీటీడీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి గానీ, కరుణాకర రెడ్డి గానీ పట్టించుకోలేదు. దాంతో ఆ దురాగతాలు అలాగే చెలరేగుతూ వచ్చాయి. తాజాగా అన్యమతస్తులను ఉద్యోగులను తొలగించాలని, ఇతర శాఖలకు పంపేయాలని బిఆర్ నాయుడు ఉత్తర్వులు జారీచేయడం పట్ల శ్రీవారి భక్తుల్లో హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి.