సాధారణంగా ఫ్యాక్షన్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఒక లక్షణం ఉంటుంది. ఒక వర్గానికి చెందిన పార్టీ అధికారంలోకి వస్తే.. రెండో వర్గానికి చెందిన మగవాళ్లందరూ ఊరు విడిచిపారిపోతారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా తిరిగి ఆ ఊరికి రారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే వస్తారు. అప్పుడు రెండో పార్టీ వారు ఊరు విడిచిపారిపోతారు. అచ్చంగా ఇలాగే కాకపోయినప్పటికీ.. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో చేసిన పాపాలు.. పెను భూతాలుగా మారి వెంటాడుతూ ఉండడంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు ప్రస్తుతం పరారవుతున్నారు.
మాచర్లలో విధ్వంసానికి, హింసకు, దాడులకు, పోలింగు బూత్ ల మీద దాడులకు కారకులు అయిన పిన్నెల్లి సోదరుల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్యే రామక్రిష్ణారెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి ఏమయ్యాడో ఇప్పటిదాకా తెలియదు. పిన్నెల్లి సోదరులు ఇద్దరూ అరెస్టు భయంతో ముందే పరారైనప్పటికీ.. ఎన్నికల కౌంటింగుకు ముందుగా రామక్రిష్ణారెడ్డి కోర్టు ద్వారా ముందస్తు బెయిలు తెచ్చుకుని బయటకు వచ్చారు. కౌంటింగు అనంతరం మొత్తానికి పిన్నెల్లి అరెస్టు జరిగింది. మరి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి సంగతేమిటి? ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నారు. చెన్నైలో ఉన్నారని, మరోచోట ఉన్నారని రకరకాలపుకార్లు వస్తున్నాయి గానీ.. పోలీసులు పట్టించుకోవడంలేదు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేయడంలో పోలీసుల అసమర్థత బయటపడుతోంది.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడి కేసులో ఇప్పటికే వైసీపీ కీలక నాయకులు కొందరు ముందస్తు బెయిళ్ల మీద బయట తిరగగలుగుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద కూడా కేసు నమోదు అయింది. ఈ దాడి కేసులో ఆయన తన అనుచరుల్ని రెచ్చగొట్టి దాడిచేయించినందుకు 71వ నిందితుడిగా చేర్చారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు గానీ.. ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వంశీ అమెరికా పారిపోయాడని కూడా అంటున్నారు.
ఈ నాయకులు నిజంగానే పరారీలో ఉంటున్నారా? లేదా, ఇన్నాళ్లూ పోలీసు వ్యవస్థలో కీలక స్థానాల్లో తిష్టవేసుకున్న జగన్ భక్త అధికారులు వీరికి సహకరిస్తున్నారా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ ఇద్దరు నాయకులు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా అనేకమంది వైసీపీ నాయకులు గత ప్రభుత్వ హయాంలో చేసిన పాపాలు కేసుల రూపంలో వెంటాడుతుండడంతో పరారవుతున్నట్టుగా తెలుస్తోంది.
పాపాలు వెంటాడుతున్నాయ్ : పరారీలో నేతలు!
Sunday, November 10, 2024