చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన పూర్తి చేసుకుంది. ఐదేళ్లపాటు సాగిన వైయస్ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన, విధ్వంసకర పరిపాలన నేపథ్యంలో చరిత్రలో ఎన్నడూ లేనంత తిరుగులేని మెజారిటీతో చంద్రబాబు నాయుడుకు తెలుగు ప్రజలు అధికారం కట్టబెట్టారు. వారు ఇలాంటి నమ్మకాన్ని చూపించడం వెనుక- చంద్రబాబు నాయుడు కార్యసమర్ధత మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారనేది స్పష్టం. అనాధలా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశించడానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం మాత్రమే కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నది తేలిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం మరింత శ్రద్ధగా, మరింత బాధ్యతతో, మరింత సమయాన్ని వెచ్చించి అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ పరిపాలనకు సమాంతరంగా పార్టీ మీద దృష్టి పెట్టడం కష్టమే. కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వారిని కాపాడుకోవడానికి కూడా పాలకులు దృష్టి సారించడం వారికి అదనపు భారం అవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఇందుకు పూనిక వహిస్తున్నారు. కార్యకర్తలు లేకుండా పార్టీ లేదని, పార్టీ లేకుండా ప్రభుత్వం ఉండజాలదని అంటూ ఆయన పార్టీ కోసం సమానంగా సమయం వెచ్చిస్తానని హామీ ఇస్తున్నారు. ఒకరోజులో సగం ప్రజల కోసం, ప్రభుత్వ పరిపాలన కోసం కేటాయిస్తే- మిగిలిన సగం పార్టీ కోసం కేటాయిస్తానని మాట ఇస్తున్నారు. కార్యకర్తలు ఎన్నడూ కూడా అసంతృప్తికి లోనయ్యే పరిస్థితిని తాను కల్పించనని చంద్రబాబు అంటున్నారు. ఈ ఒక్క మాట కార్యకర్తలకు కొండంత భరోసాను అందిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత అని, వారికి నాయకులు అండగా ఉండాలని అన్నారు. అలా ఉండకుంటే నాయకులకు ఆ సంగతి బోధపడేలాగా చర్యలు తీసుకుంటాం అంటూ భరోసా ఇచ్చారు. కార్యకర్తలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి పార్టీ పదవులు ఇస్తున్నాం, ఇతర పదవులు కట్టబెడుతున్నాం అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి నేను రాత్రింబవళ్లు పట్టుదలతో పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోవడంలేదని మీరు అలిగే ప్రమాదం ఉంది. అప్పుడు మీరు కాడి కింద పడేస్తారు. మీరు ఎక్కడికి పారిపోరు. ఏ ఇతర జెండా పట్టుకోరు. ఇతరులు ఎవ్వరికి ఓటు వేయరు కానీ అలకపూనుతారు. ఆ అలక ప్రమాదకరం. భవిష్యత్తులో ఎప్పటికీ కూడా మీరు అలిగే పరిస్థితి గానీ మనం మళ్ళీ ఓడే పరిస్థితి కానీ రానివ్వను.. అంటూ చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు హామీ ఇచ్చారు. మొత్తానికి ప్రభుత్వంపై చూపుతున్న శ్రద్ధకు సమాంతరంగా పార్టీ కార్యకర్తలను కూడా కాపాడుకోవడం గురించి అధినేత ఫోకస్ పెడుతుండడం శుభసంకేతం అని పార్టీ వర్గాలు హర్షామోదాలు వ్యక్తం చేస్తున్నాయి.
చంద్రబాబు మాటలే కార్యకర్తలకు కొండంత బలం!
Friday, July 11, 2025
