భళా బడ్జెట్ : చంద్రబాబు చిత్తశుద్ధి, ఓర్పు ఫలితం!

Friday, September 20, 2024

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరించిన వ్యూహం, పాటించిన ఓర్పు, కనబరిచిన చిత్తశుద్ధి ఫలితమే ఇవాళ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆశాజానికమైన కేటాయింపులు జరగడం^ అని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రం బహుముఖంగా మారనున్నదని అంచనా వేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉంటూ చంద్రబాబు నాయుడు ఎటువంటి డాంబికపు ప్రకటనలకు పోకుండా కేంద్రంలోని పెద్దలతో సామరస్య వైఖరితోనే ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చడానికి సాధించిన విజయం ఇది అని అందరూ అంటున్నారు.

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాల కోసం ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో తీసుకునే నిధులను అమరావతి కోసం ఇస్తున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ కూడా ఇచ్చారు. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ కు అప్పు రూపంలో ఇస్తున్న మొత్తం అని ఆమె చెప్పలేదు. కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ అప్పుతో సంబంధం ఉండదు- అన్నట్లుగానే ప్రస్తుత సంకేతాలు ఉన్నాయి. ఈ నిధులతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఎంతో వేగం పుంజుకుంటాయని అర్థం చేసుకోవాలి. ఇప్పటికే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 15 వేల కోట్లు కేంద్రం కేటాయించి ఉంది. ఆ పనులు సూచనప్రాయంగా మొదలైనా సరే నగర నిర్మాణం ఊపందుకుంటుంది. దానికి తోడు ఇప్పుడు కేంద్రం ఇస్తున్న 15 వేల కోట్ల నిధులతో కోర్ కాపిటల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తే కనుక,  ప్రైవేటు భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతాయి. రాబోయే రెండు మూడు ఏళ్లలో అమరావతి రూపురేఖలు మారిపోతాయని ఆశించవచ్చు.

పోలవరం విషయానికి వస్తే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి బాధ్యత తమదే అని ప్రాజెక్టు త్వరగా పూర్తి కావడానికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని కేంద్రం అందిస్తుందని కూడా నిర్మలా సీతారామన్ సభా ముఖంగా ప్రకటించారు.

వాటికి తోడు విశాఖపట్నం బెంగళూరు పారిశ్రామిక కారిడార్ విషయంలో గాని, అలాగే విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్ లోని కొప్పర్తి నోడ్ అభివృద్ధికి, హైదరాబాదు- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లోని ఓర్వకల్ నోడ్ అభివృద్ధికి పూర్తి సాయం అందిస్తామని కేంద్రం ప్రక్టటించింది. ఈ నోడ్ లకు నీళ్లు, విద్యుత్తు, రైల్వే, రహదారి సదుపాయాల కల్పనకు సంబంధించిన నిధులను అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. వీటితో పారిశ్రామిక పురోగతి వేగం పుంజుకుంటుంది.
 
ఇవన్నీ ఒక ఎత్తు అయితే విభజన చట్టంలో చెప్పినట్లుగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ఉమ్మడి జిల్లాకు 50 కోట్ల రూపాయల వంతున గ్రాంట్ గా ఇవ్వడానికి కూడా కేంద్రం అంగీకారం తెలిపింది. గత పదేళ్లలో మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఎంత సాయం అందించిందో, ఒకేసారి అంత మొత్తాన్ని ఇప్పుడు ఈ ఏడాదిలో ప్రకటించడం విశేషంగా గమనించాలి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కేంద్రంలోని పెద్దలతో సానుకూల దృక్పథం ద్వారా సాధించిన విజయం అని అందరూ అభినందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు పాలనలో పరుగులు తీస్తుందని ఆశిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles