ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించారో అందరికీ తెలుసు. ఆ పార్టీ కార్యకర్తలుగా, తొత్తులుగా ఉద్యోగాలు పొందిన వాలంటీర్లు కూడా అలాగే చెలరేగిపోయారు. ఈ క్రమంలో ఎన్నికల నిబంధనలు, అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడానికి అడ్డుపడుతుండే సరికి.. వాలంటీర్లు అనేకమంది ఏకంగా రాజీనామాలు చేశారు. యథేచ్ఛగా పార్టీ కండువాలు కప్పుకుని ప్రచారానికి వెళ్లారు. అప్పటిదాకా తాము పింఛన్లు పంపిణీ చేసిన లబ్ధిదారులను పార్టీ తరఫున కలిసి మభ్యపెట్టి, భయపెట్టి.. జగన్ కు అనుకూలంగా ఓటు వేయించడానికి ప్రయత్నించారు. అయితే ఇప్పుడు అదే వాలంటీర్లు రోడ్డునపడ్డారు. ఉద్యోగాల్లేవు. పైగా పోలీసు స్టేషను మెట్లెక్కుతున్నారు. తమతో వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదుచేస్తున్నారు. పోలీసు యంత్రాంగం ఈ ఫిర్యాదులను సీరియస్ గా తీసుకుంటే గనుక.. ఎన్నికల సమయంలో జరిగిన వాలంటీర్ల రాజీనామా వ్యవహారాలు.. వైసీపీ స్థానిక నాయకుల మెడకు కేసుల రూపంలో చుట్టుకునే ప్రమాదం కనిపిస్తోంది.
నిజానికి వాలంటీరు వ్యవస్థ ద్వారా పేద ప్రజలను, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎప్పటికీ మభ్యపెడుతూ, భయపెడుతూ ఉండవచ్చునని, శాశ్వతంగా లోబరచుకోవచ్చునని జగన్మోహన్ రెడ్డి భావించారు. దానికి తగ్గట్టుగానే వాలంటీరు వ్యవస్థను తీసుకువచ్చారు. వారితో ప్రతి నెలా లబ్ధిదారులకు డబ్బులు ఇప్పిస్తూ.. తన భజన చేయించేవారు. జగనన్నే మీకు డబ్బులు ఇస్తున్నాడంటూ ఊదరగొట్టించేవారు. ఎన్నికల సమయంలో కూడా వారితో డబ్బులు పంపుతూ.. జగనన్న మళ్లీ రాకపోతే మీ డబ్బులు ఆగిపోతాయ్ అని భయపెట్టే ప్రయత్నం చేశారు. తీరా కోడ్ అమల్లోకి వచ్చాక వాలంటీర్ల ద్వారా పంపిణీని ఈసీ అడ్డుకుంది.
దీంతో వైసీపీ నాయకులు కొత్త ఎత్తుగడ వేసి.. ఆ వాలంటీర్లకు రెండు నెలల జీతాలు తామే ఇస్తాం అని ప్రకటించి, గెలిచాక మళ్లీ ఉద్యోగాలు ఇస్తాం అని మభ్యపెట్టి.. మొత్తానికి రాజీనామా చేయించి.. అనుకున్న తరహాలోనే ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. ప్రభుత్వం మారడంతో వాలంటీర్ల బతుకులు రోడ్డున పడ్డాయి. వారంతా ఇప్పుడు పోలీసుస్టేషన్లలో కేసులు పెడుతున్నారు. తమను బెదిరించి బలవంతంగా రాజీనామాలు చేయించారని, వైసీపీ నేతల మీద ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు చర్యలకు ఉపక్రమిస్తే.. వైసీపీ నేతలు పెద్దసంఖ్యలో జైళ్లపాలవాల్సి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.
వాలంటీర్ రాజీనామాలు వారి మెడకు చుట్టకుంటాయా?
Friday, September 20, 2024