భూకబ్జాలు, అక్రమ ఇసుక తవ్వకాలు వంటి అనేక అక్రమాల్లో భాగస్వామిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావుపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అనారోగ్యం మిషమీద ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నదని అనుమానాలు రేగుతున్న నేపథ్యంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఈ అంశాన్ని వారం రోజుల ముందే ఆంధ్రా వాచ్ అంచనా వేసింది. దానికి తగ్గట్టుగానే తాజాగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో విచ్చలవిడి అక్రమాలకు పాల్పడిన నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చాలా మంది చేసిన అక్రమాలకు సంబంధించి ఇప్పటికే కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ, బెయిళ్ల చుట్టూ తిరుగుతున్నారు. బయట ఉన్న అక్రమార్కులైన వైసీపీ నాయకులు కూడా ఏ క్షణాన తమ మీద ఏ కేసు చుట్టుకుంటుందో అనే భయంతో గడుపుతున్నారు. ఈక్రమంలోనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి కూడా గుండెల్లో నొప్పి వచ్చింది. హైదరాబాదులో చికిత్స చేయించుకున్నారు. తర్వాత ముంబాయికి వెళ్లి సర్జరీ చేసుకున్నారు. కొన్నాళ్లు అక్కడే గడిపి హైదరాబాదు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు.
కొడాలి నానిలో తన అరెస్టు కూడా జరుగుతుందనే భయం పెరిగిందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన కనీసం పార్టీ వారిని, పరామర్శలకు వచ్చే వారిని కూడా కలవడం మానేశారు. అత్యంత ఆత్మీయుల్ని మాత్రమే కలుస్తున్నారు. అనారోగ్యం అనే కారణాన్ని చూపించి, మెరుగైన చికిత్స కోసం అని చెబుతూ.. అమెరికాకు వెళ్లిపోవాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఈ సంగతి కూడా లీక్ అయింది. చికిత్స కారణాల మీద ఒకసారి అమెరికాకు వెళ్లిపోతే సుదీర్ఘకాలం అక్కడే ఉండిపోతారని కూడా.. కూటమి ప్రభుత్వం కేసుల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తపడుతున్నారని కూడా లీక్ అయింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రావాచ్ డాట్ కామ్ కూడా వారం రోజు ల కిందట ఓ కథనం అందించింది. కొడాలి నాని మీద లుకౌట్ నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నదని.. కథనం అందించింది.
వారం రోజుల్లోనే ఆ పర్వం కూడా పూర్తయింది. కొడాలినాని విదేశాలకు పారిపోకుండా.. పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. అనేక మంది వైసీపీ నిందితులు ఇప్పటికే పరారీలో ఉన్నారని అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో కొడాలి నాని కూడా జారుకోకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది.
ఆంధ్రావాచ్ అంచనా నిజం: కొడాలి నానిపై లుకౌట్ జారీ!
Thursday, June 19, 2025
