సాధారణంగా రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులు ఆర్థికంగా బలంగా ఉండకూడదని ఆశిస్తాయి. అందుకే ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తుంటాయి. పాపం.. ఏపీలో ఇప్పటికే 11 సీట్లకు దిగజారిపోయి పార్టీ ఉంటుందో పోతుందో అనే దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ భిన్నమన ఇబ్బందిని ఎదుర్కొంటోంది. ప్రత్యర్థుల ఆర్థిక వనరులు వారిని భయపెట్టడం లేదు. ఎందుకంటే వారిని మించిన ఆర్థిక వనరులు ప్రత్యర్థి పార్టీల వద్ద లేవు. కానీ.. ఎన్డీయే కూటమి పార్టీల ఐక్యత వారిని వణికిస్తోంది. ఆ ఐక్యత చూసి, ఇక రాష్ట్రంలో తాము ఎప్పటికీ అధికారంలోకి రాలేమేమో అనే భయంతో వైసీపీ నాయకులు గడుపుతున్నారు. ఒకవైపు పవన్ కల్యాణ్ లాంటి కీలకమైన కూటమి నాయకులు.. రాబోయే పదిహేనేళ్లపాటూ కూటమి ఐక్యత పదిలంగా ఉండాలని.. పదిహేనేళ్లపాటూ కూటమి ప్రభుత్వం స్థిరంగా పరిపాలన సాగిస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అంటున్న మాటలు.. వైసీపీ నేతలను వణికిస్తున్నాయి. అదే నిజమౌతుందేమో అని భయపడుతున్నారు. అందుకే కూటమి పార్టీల ఐక్యతకు గండికొట్టడానికి వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్డీయే కూటమి పదిలంగా ఉండడానికి పవన్ కల్యాణ్ ఒక ఇరుసులాగా కీలకంగా వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు. చంద్రబాబునాయుడుతో జట్టుకట్టి 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పతనం చేయాలని పవన్ నిర్ణయించుకున్న నాటికి ఆయన కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్నారు. తెలుగుదేశాన్ని కూడా కూటమిలోకి తీసుకురావడానికి, అప్పటి రాష్ట్ర బిజెపి నాయకులు కొందరు అడ్డుకున్నా.. చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఎంత ఉన్నదో, జగన్ వల్ల జరుగుతున్న ప్రమాదం ఏమిటో ఢిల్లీ పెద్దలకు తెలియజెప్పి కూటమి సాకారం అయ్యేలా చేసిన ఘనత ఆయనదే. ఇప్పటికీ కూటమి సవ్యంగా కొనసాగుతున్నదనంటే ఆయన ఒక కారణం. కాబట్టి పవన్ కల్యాణ్ ను రెచ్చగొట్టి కూటమిలో చీలికలు తేవాలని వైసీపీ ప్రయత్నిస్తున్నది.
మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ కు హెలికాప్టర్ ఎక్కడం, ప్రత్యేక విమానంలో తిరగడం తప్ప ఈ ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదని రెచ్చగొడుతున్నారు. తమాషా ఏంటంటే.. డిప్యూటీ ముఖ్యమంత్రులుగా కులానికి ఒకరు వంతున నలుగురిని నియమించి.. వారిని పురుగుల కంటె హీనంగా చూసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది.. ఇప్పుడు ప్రభుత్వంలో ప్రతి నిర్ణయంలోనూ, ప్రతి కార్యక్రమంలోనూ చివరికి ప్రతి ప్రకటనలోనూ డిప్యూటీ ముఖ్యమంత్రికి తదనుగుణమైన ప్రాధాన్యం ఇస్తుండగా.. అంబటి రాంబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
కేవలం అంబటి మాత్రమే కాదు. ఇటీవలి కాలంలో వైసీపీ మారుతున్న వ్యూహాల్ని గమనిస్తే.. అటు జగన్మోహన్ రెడ్డి నుంచి.. పార్టీలో ప్రతి నాయకుడు కూడా పవన్ కల్యాణ్ ను కూటమి ఐక్యత విషయంలో రెచ్చగొట్టే విధంగానే మాట్లాడుతున్నారు. అయితే ఇలాంటి కుట్రలను పవన్ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. తాను జాగ్రత్తగా ఉండడం కాదు.. వారి మాటలను పట్టించుకుని రెచ్చిపోకుండా కూటమి పార్టీల నేతలతో సర్దుకుపోతూ సయోధ్యతోనే ఉండాలని తమ పార్టీ కార్యకర్తలందరికీ హితవు చెప్పడం కూడా గమనార్హం.