నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ‘అఖండ’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న చిత్రమనే చెప్పాలి. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫేజ్‌లోకి అడుగుపెట్టబోతోంది.
తాజా సమాచారం ప్రకారం, చిత్ర బృందం వచ్చే వారంలో జార్జియాకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడే క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మే 21 నుంచి ఈ కీలక పార్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సీన్ల కోసం బోయపాటి శ్రీను ముందుగా లొకేషన్లను పరిశీలించి ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ క్లైమాక్స్ సీన్‌లో బాలకృష్ణతో పాటు అనేక మంది ఫైటర్స్ పాల్గొంటారు. భారీ యాక్షన్ ఎపిసోడ్‌గా ఈ భాగాన్ని ప్లాన్ చేసినట్టు సమాచారం. అద్భుతమైన విజువల్స్‌తో ఈ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని సినీ వర్గాల అంచనా.
ఇక ఈ సినిమాలో సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తోంది. సంగీతానికి థమన్ బాధ్యతలు చేపట్టగా, నిర్మాణాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట కలిసి నిర్వహిస్తున్నారు. అన్ని విధాలుగా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా అంచనాలను పెంచుతోంది.