ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వర్మ్ అని సామెత. ఈ సామెతకు- ముందుగా నిద్రలేచిన పిట్టకే ఫలితం దక్కుతుంది అని అర్థం వస్తుంది. సమయానికి తగ్గట్టు వేగంగా స్పందించడం అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో నారా లోకేష్ తొలి ఆఫర్ తోనే.. ఏఐ సెంటర్ కోసం తన ప్రయత్నం ప్రారంభించారు. కేంద్రం తన వార్షిక బడ్జెట్ లో ఏఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకరేషన్ ప్రనకటించగానే.. నారా లోకేష్ ప్రత్యేకంగా ఇదే పని మీద ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి.. ఆ కేంద్రాన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెలకొల్పాలని కోరడం విశేషం. బహుశా కేంద్రం ఆ కేంద్రాన్ని ప్రకటించిన తర్వాత.. రాష్ట్రాలనుంచి వారికి వచ్చిన మొదటి ఆఫర్ ఇదే అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
విశాఖపట్నం నగరాన్ని ఐటీ హబ్ గా అభివృద్ధి చేయడానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేస్తున్న నేపథ్యంలో, విశాఖపట్నంలోనే ఈ కేంద్రం ఏర్పాటు చేయడానికి లోకేష్ కేంద్ర మంత్రిని అభ్యర్థించడం విశేషం. త్వరలోనే విశాఖ, తిరుపతి నగరాల్లో పర్యటించి.. గత తెదేపా హయాంలో చేసిన పనులను స్వయంగా చూస్తానని అశ్వనీ వైష్ణవ్ హామీ ఇచ్చినట్టుగా లోకేష్ వెల్లడించారు.
చంద్రబాబు సంకల్పంలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఏఐ అనేది ప్రపంచ సాంకేతిక రంగం యొక్క రూపురేఖలనే మార్చే టెక్నాలజీగా ఆవిర్భవించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గమనించినప్పుడు.. ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్న ఏకైక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు మాత్రమే ఉన్నారు. గతంలో, సుమరు రెండు దశాబ్దాల కిందట ఐటీ గురించి కూడా చంద్రబాబునాయుడు ఇలాగే మాట్లాడారు. ఇవాళ ఐటీ రంగం ఎలా ప్రపంచాన్ని శాసిస్తున్నదో.. తెలుగువారి ప్రాబల్యం ఈ రంగంలో ఎంతగా ఉన్నదో అందరికీ తెలుసు. అదే విధంగా ఏఐ రంగంలో కూడా.. తెలుగుముద్రను వేయడానికి చంద్రబాబు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
లోకేష్ డిల్లీలో మాట్లాడుతూ.. విశాఖలో టీసీఎస్ వారి కార్యకలాపాలు.. రెండునెలల్లోగా ప్రారంభం అవుతాయని అంటున్నారు. విశాఖలో తాము ఏర్పాటు చేయదలచుకుంటున్న డేటా సిటీకి సహకరించాలని కేంద్రమంత్రిని కోరినట్టుగా లోకేష్ వెల్లడించారు. విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటుకు సంబంధించి కూడా త్వరలోనే ప్రకటన వస్తుందని ఆయన అంటున్నారు.
ఏఐ టెక్నాలజీ విషయంలో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉంది. చంద్రబాబు సర్కారు ప్రయత్నాలకు బహుముఖంగా కేంద్రం అండదండలు అందిస్తున్న నేపథ్యంలో విశాఖ డేటా సిటీకి గానీ, ఏఐ కేంద్రానికి గానీ తప్పకుండా వారి మద్దతు ఉంటుందని ప్రజలు ఆశిస్తున్నారు.
విశాఖలో ఏఐ సెంటర్.. లోకేష్ దే తొలి ప్రయత్నం!
Wednesday, February 12, 2025
