బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి ముందే బాహాబాహీ

Saturday, April 20, 2024

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న ఓ ప్రభుత్వ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి ముందే బాహాబాహీకి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంతే అంటూ మాటలతో యుద్ధం చేసుకున్నారు. పక్కనున్న వాళ్లు కల్పించుకోకపోతే కొట్లాటకు సిద్ధమయ్యారు. చేతులతో కొట్టుకొనే పరిస్థితి ఏర్పడింది.

ఇదంతా వేదికపైననే జరిగింది. వారిద్దరి మధ్య ఉన్న మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి జోక్యం చేసుకొని, వారికి సర్దిచెప్పవలసింది పోయి, తనకెందుకులే అన్నట్లు పక్కకు తప్పుకున్నారు. అప్పుడు జిల్లా అధికారులు వారికి సర్దిచెప్పి విడదీయకపోతే ప్రజలముందు మరింతగా నవ్వులపాలయ్యే వారు.

సీఎం కేసీఆర్ పై పొగడ్తలు కురిపిస్తూ, మూడోసారి కూడా అధికారంలోకి రాబోతున్నామని చెప్పడంతో కాంగ్రెస్ ఎమ్యెల్యే కన్నెర్ర చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని లక్ష్మినగరంలో జరిగిన తునికి ఆకుల సేకరణ చెక్కుల పంపిణీ  కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు (బీఆర్ఎస్), భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య (కాంగ్రెస్) కూడా పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదం కొంతకాలంగా నెలకొంది. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన కేసీఆర్‌ను కాంతారావు పొగడ్తలతో ముంచెత్తడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు చిర్రెత్తుకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ మూడోసారి కేసీఆర్ గెలుస్తారని అనడంతో పోదెం వీరయ్య అడ్డుకున్నారు.

కాంతారావు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పొగుడుతూ తన పార్టీ పేరును ప్రస్తావిస్తూ ‘మా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది’ అని ధీమాగా చెప్పడంతో వివాదం మొదలైంది. కాంతారావు వ్యాఖ్యలపై పొదెం వీరయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా ఎలా చేస్తారని వీరయ్య ప్రశ్నించారు.

 దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్రం వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరు సీట్లో నుంచి పైకిలేచి కొట్టుకోబోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకున్నారు. వారి మధ్య వాగ్వాదం పెరిగి వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకుంది. ఇద్దరూ గొడవ పడుతున్న క్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అక్కడ నుంచి లేచి పక్కకు వెళ్లిపోయారు.

ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని ఇద్దర్నీ వారించారు. ఇరు ఎమ్మెల్యేల అనుచరులు ఒకరికొకరు వ్యతిరేక నినాదాలు చేశారు. ఇద్దరు ఒకరు మీదకు ఒకరు వెళ్లారు. నువ్వెంత అంటే నువ్వు ఎంత అని ఒకరినొకరు దూషించుకున్నారు.

సుమారు 15 నిమిషాల పాటు ఇద్దరు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలతో పాటు ఇరు వర్గాల కార్యకర్తలు కూడా ఒకరిపై ఒకరు వివాదాస్పద వాఖ్యలు చేసుకున్నారు. చివరకు జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్, జిల్లా కలెక్టర్ ఇరువర్గాల మధ్య వివాదాన్ని అదుపు చేసి సద్దుమణిగేటట్లు చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles