బలమున్నా భయం! బలం లేకున్నా ధీమా!

Tuesday, April 16, 2024

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చిత్రమైన వాతావరణం నెలకొంది. తెలుగుదేశం, జనసేన పార్టీలనుంచి ఫిరాయింపజేసుకున్న ఎమ్మెల్యేల బలాన్ని, తమ పార్టీని ఖాతరు చేయకుండా దూరం ఉంటున్న వారి సంఖ్యను కూడా కలిపి లెక్కవేసుకుంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా ఏడుస్థానాలు దక్కి తీరాలి. అంటే తెలుగుదేశానికి ఓటమి తప్పదు. అయినా సరే.. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా భయపడుతోంది. అదే సమయంలో తెలుగుదేశం మాత్రం చాలా ధీమాగానే ఉంది. అదే తమాషా.
175 మంది ఎమ్మెల్యేలున్న సభ నుంచి 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి కనీసం 22 ప్రథమ ప్రాధాన్య ఓట్లు రావాలి. అంటే.. సహజమైన బలం ప్రకారం చూస్తే తెలుగుదేశానికి ఒక సీటు దక్కాలి. కానీ.. ఆ పార్టీనుంచి నలుగురు ప్రస్తుతం దూరం జరిగి, వైకాపా నీడలో బతుకుతున్నారు. జనసేన ఎమ్మెల్యే కూడా వైసీపీ పంచలోనే బతుకీడుస్తున్నారు. అంటే ఆ పార్టీ సహజమైన బలం 151 కి, ఈ అయిదు తోడయ్యాక.. మొత్తం బలం 156 అవుతుంది. ఖచ్చితంగా ఏడు సీట్లు దక్కించుకోవడానికంటె రెండు సీట్లు ఎక్కువన్నమాట.
ఆ పాయింటు దగ్గరే వైసీపీ భయం కూడా. ఆల్రెడీ పార్టీమీద తిరుగుబాటు ప్రకటించిన నెల్లూరుజిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరూ ఆత్మప్రబోధానుసారం ఓటేస్తామంటూ ఒక ఝలక్ ఇచ్చి ఉన్నారు. వీరి ఓట్లు అధికార పార్టీకి దక్కవు. అవి మైనస్ చేస్తే లెక్క 154 అవుతుంది గానీ.. అవన్నీ కచ్చితంగా పడతాయా? అనేది వారి భయం. అసలే మాక్ పోలింగ్ నిర్వహిస్తే.. గౌరవనీయులైన వైసీపీ శాసనసభ్యులు చెల్లని ఓట్లు వేస్తున్నారు. వారికి అంత తెలివితేటలు ఉన్నాయన్నమాట. వారిని నమ్ముకుని ఎన్నికలకు వెళితే పుట్టిముంచుతారేమోనని వైసీపీ భయం.
అయినా సరే.. 154 మందిని ఏడుగురు ఎమ్మెల్సీలకు తలా 22 మందిని పంచేసి వారికి ఓటు వేసే కోచింగ్ ఇస్తున్నారు. ఎవరు తేడా కొడతారో అనే ఉద్దేశంతో అందరికీ సెకండ్ ప్రయారిటీ ఓటు మాత్రమే కాదు కదా.. మొత్తం ఏడు ప్రాధాన్యాలను కూడా ఖచ్చితంగా మార్క్ చేయవలసిందే అని చెబుతున్నారు. ఇద్దరు పోతే పర్లేదు.. తమ పార్టీనుంచి ఇంకా ఎక్కువమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారని భయపడుతున్నారు. అనుమానం ఉన్న సుమారు పది మంది ఎమ్మెల్యేల మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా వైసీపీ తమకు చాలినంత బలం ఉన్నప్పటికీ.. భయంతో సతమతం అవుతోంది.
అదే సమయంలో.. తమకు నికరమైన ఓట్లు 19 మాత్రమే అయినప్పటికీ.. అధికార పార్టీ మీద విసిగిపోయిన వారి ఎమ్మెల్యేలు కనీసం నలుగురు తమకు అండగా నిలుస్తారనే ధీమాతో.. తెలుగుదేశం ప్రవర్తిస్తోంది. ఇదీ ప్రస్తుత రాజకీయ వైచిత్రి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles