పొత్తులపై శ్రీకాకుళంలో స్పష్టం చేసిన పవన్

Friday, April 19, 2024

వచ్చే ఎన్నికలలో టిడిపితో పొత్తు గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో జరిగిన జనసేన  శక్తి బహిరంగసభలో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. బలమైన శత్రువుతో పోరాడేందుకు అవసరమైనప్పుడు మనకు ఇష్టంలేకున్నా  కొందరితో కలిసి వెళ్లాల్సి వస్తుందని తేల్చి చెప్పారు.

అయితే, మనకు గౌరవం తగ్గకుండా ఉంటేనే కలిసి ముందుకు సాగుతామని.. లేకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని భరోసా ఇచ్చారు.  ప్రజలంతా మద్దతు ఇస్తే ఒంటరిగా ఎన్నికలకు వెళతానని చెబుతూ తనకు ప్రస్తుతం అటువంటి నమ్మకం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఒంటరిగా గెలిస్తే పొత్త ఎందుకు పెట్టుకుంటానని ప్రశ్నించారు. ఇప్పుడు తన దగ్గర ఉంటారని., ఎన్నికలు రాగానే తన వాడు, తన కులం వాడు అని వెళ్లిపోతారని చెబుతూ ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందటం అవసరమా ? అని ప్రశ్నిస్తూ  పరోక్షంగా పొత్తులతో ముందుకు సాగుతానని తేల్చి చెప్పారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఎందుకు అన్నానంటే అంటూ 53 నియోజకవర్గాల్లో వైస్సార్సీపీ సాంకేతికంగా గెలిచిందని గుర్తు చేసారు. ఇటీవల చంద్రబాబుతో సమావేశమైతే కొందరు పిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు. బేరాలు కుదిరాయని పిచ్చి వాగుడు వాగుతున్నారని కన్నెర్ర చేశారు.

“నేను అలాంటిని వ్యక్తిని కాదు. రూ. 25 కోట్లు ట్యాక్స్‌ కట్టే వ్యక్తిని నేను” అంటూ . చంద్రబాబు, పవన్‌ రెండున్నర గంటలు ఏం మాట్లాడారని గొంతు చించుకుంటున్నారని దుయ్యబట్టారు. “సంబరాల రాంబాబు గురించి 22 నిమిషాలు, పనికిమాలిన ఐటీ మంత్రి రాష్ట్రాన్ని 15వ స్థానంలోకి నెట్టేశాడేంటని 18 నిమిషాలు. లాం అండ్‌ ఆర్డర్‌ ఎందుకు చితికిపోయింది, ఏం చేయాలి అని 38 నిమిషాలు మాట్లాడుకున్నాం” అంటూ ఎద్దేవా చేశారు. మాట్లాడే కొద్దీ కేసులు వస్తున్నాయని చెబుతూ ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఎలా ఉండాలి అని గంటన్నర సేపు మాట్లాడుకున్నాం అని పవన్ చెప్పుకొచ్చారు

వైసిపి ప్రభుత్వంపై నిప్పులు

వైసిపి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ `ఖైదీ నెంబర్‌ 6093′ కూడా తనను విమర్శిస్తారా?, అంటూ సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి విస్మయం వ్యక్తం చేశారు.  డీజీపీ సెల్యూట్‌ చేస్తోంది కూడా సీఎంకు కాదు.. ఓ ఖైదీకే అని పవన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే కుట్రలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.

ఇది మూడు ముక్కల ప్రభుత్వం, మూడు ముక్కల ముఖ్యమంత్రి అని విమర్శించారు. ఏపీలో మూడు ముక్కల ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని పేర్కొంటూ మాట్లాడితే మూడు పెళ్లిళ్లు, దత్తపుత్రుడని అంటున్నారని, వైసీపీది కాయ్‌ రాజా కాయ్‌ బ్యాచ్‌ అని పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ నాన్న వైఎస్‌ఆర్‌నే  ఎదుర్కొన్నా.. నువ్వెంత? అని పవన్‌ మండిపడ్డారు. తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని, అలాంటి వాటినే ఎదుర్కొన్నా.. తన ముందు నువ్వెంత? అని నిలదీశారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధేంటి?, అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు తప్ప ఏం ఉంది? అని పవన్‌ ప్రశ్నించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles