పాత పథకంకు తన పేరు జతచేసి ‘జగనన్నకు చెబుదాం’

Saturday, April 20, 2024

పాత పధకాలకే పేర్లు మర్చి, వాటికి తన పేరో, తన తండ్రి పేరో జతచేసి సరికొత్త పథకంగా ప్రారంభిస్తుండటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పరిపాటిగా మారింది. తాజాగా, మంగళవారం ఆయన ప్రజలకు మరింతగా చేరువయ్యేలా అంటూ తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన  ‘జగనన్నకు చెబుదాం’ పథకం సహితం అటువంటిదే.

‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెబతున్నారు.

టోల్‌ ఫ్రీ నెంబర్‌-1902కు కాల్‌ చేస్తే సమస్యకు పరిష్కారం అందుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఈ పథకం పేరు చూసి అంతా ఫోన్ చేస్తే నేరుగా ముఖ్యమంత్రి జగన్ తో తమ సమస్యలపై మోర పెట్టుకోవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి ఫోన్ లో జగన్ మంత్రులకే అందుబాటులో ఉండరని ప్రతీతి. కేవలం ఆయన కార్యాలయ సిబ్బంది ఆ ఫోన్ లను తీసుకొని, సమస్యలను నోట్ చేసుకొని, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు.

ప్రస్తుతం అదేవిధంగా అమలు చేస్తున్న `స్పందన’ కార్యక్రమం ఉంది. అందులో కూడా ఫోన్ లో సమస్యలు చెబితే, ఆ సమయాకు ఒక నంబర్ ఇచ్చి, వాటి పరిష్కార దశను కూడా తెలుసుకొనే సౌలభ్యం కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆ పధకానికి పేరు మార్చడం తప్పా కొత్తదనం అంటూ ఏమీ లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి.

‘‘జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రారంభిస్తున్నా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంకు ఇప్పటికే జిల్లాల్లో జరుగుతున్న స్పందన కార్యక్రమంకు మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా?” అంటూ మాజీ మంత్రి, టిడిపి ఎమ్యెల్యే గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లుగా స్పంద‌న‌కు కాళ్లు అరిగేలా తిరిగినా ప్ర‌యోజ‌నం ఏమైనా వుందా? అంటూ ఆయన ముఖ్యమంత్రిని నిలదీశారు. రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలు చిన్నాభిన్నమైపోయారని విమర్శలు గుప్పించారు.

ఏపీలో ఇప్పుడు సమస్యలు లేనివారు ఎవరైన ఉన్నారా? అని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘‘తమ పొలాలు రాజధానికి ఇచ్చి దగా పడ్డ అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తారా?  జీతం ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూపులు చూస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా? కరువులతో అల్లాడుతూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న పేద రైతుల సమస్యలు పరిష్కరిస్తారా?” అంటూ గంటా ప్రశ్నల వర్షం కురిపించారు.

అదే విధంగా, పెన్షన్ ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తారని మీకు ఓటు వేసి.. మోసపోయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా? అంటూ జగన్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.

 గడిచిన 4 ఏళ్ల నుంచి జీతాలు సరిగ్గా పడక, జీతాలు పెంచక ఇబ్బందులు  పడుతున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా?; అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి.. ఇప్పుడు దాన్నే ఆదాయ వనరుగా మార్చి, మీరు తెచ్చిన కొత్త నాసిరకం బ్రాండ్లు తాగి ప్రాణాలు కోల్పోయి బజారున పడ్డ వారి కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కరిస్తారా..? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పోగొట్టుకున్న అవ్వ, తాతల సమస్యలు పరిష్కరిస్తారా? అంటూ గంటా శ్రీనివాసరావు ప్రశ్నలను సంధించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles