నలుగురు ఎమ్మెల్యేలపై వైసిపి సస్పెన్షన్ వేటు

Friday, April 19, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్యెల్యేలే క్రాస్ ఓటింగ్ కు పాల్పడి పార్టీ అభ్యర్థిని ఓడించి, ప్రతిపక్షం టీడీపీ అనూహ్యంగా ఒక అభ్యర్థిని గెలిపోయించుకొనే అవకాశం ఇవ్వడంతో ఆగ్రహంతో మండిపోతున్న వైసిపి అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతీకార చర్యలకు దిగారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన్నట్లు భావిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు.

నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవిలను పార్టీ నుండి బహిష్కరిస్తూ వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.  ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్ పై అంతర్గతంగా విచారణ జరిపిన అనంతరమే వారిపై పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఈ చర్యలు తీసుకున్నారని ఆ పార్టీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు.

పైగా, ఒక్కో ఎమ్మెల్యేను టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రూ. 15 నుంచి రూ. 20 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చెప్పి ఉండవచ్చునని సజ్జల పేర్కొన్నారు.  అయితే.. కొన్నాళ్లుగా ఆనం, కోటంరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు ఎలాగూ తమకు సపోర్ట్ చేయబోరని పార్టీ భావించింది.

కానీ.. కొత్తగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పేర్లు తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు గురువారం సాయంత్రమే ఆరోపణలు వచ్చాయి. కానీ ఉండవల్లి, మేకపాటి వాటిని ఖండించారు. తాము క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని వివరణ ఇచ్చారు. కానీ పార్టీ సంతృప్తి చెందలేదు. దీంతో సస్పెన్షన్ వేటు వేసింది.

కాగా, వైసీపీని అధిష్టానాన్ని దిక్కిరిస్తూ వస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీలో చేరలేదు కానీ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తానని ఎప్పుడో ప్రకటించారు. రానున్న రోజుల్లో కోటంరెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం కూడా ఉంది. ఇలా ఉండగా, కోటంరెడ్డి ఇలా ఉంటే ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి టీడీపీలో చేరి వైసీపీకి షాకిచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో గిరిధర్‌రెడ్డి శుక్రవారం టీడీపీలో చేరారు. గిరిధర్‌రెడ్డికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. గిరిధర్‌రెడ్డి టీడీపీ చేరుతున్న నేపథ్యంలో నెల్లూరు నగరంలో చంద్రబాబు, లోకేష్ ఫొటోలున్న ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. గిరిధర్‌రెడ్డి నెల్లూరు నుంచి భారీ కాన్వాయ్‌తో తాడేపల్లి వెళ్లి టీడీపీలో చేరారు.

మరోవంక, వైసీపీ అధిష్టానం  తీరుపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మండిపడుతున్నారు. ఉదయగిరి వైసీపీలో నాలుగు వర్గాలుగా విభజించి అధిష్టానం పెద్దలు పాలించే ప్రయత్నం చేశారని విమర్శించారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం అధిష్టానంలో పలికే నాధుడే లేడని, సచివాలయంలో ఏ అధికారిని కదిలించినా నిధులు లేవని సమాధానం చెబుతున్నారని ధ్వజమెత్తారు. బటన్ నొక్కితే సీఎం జగన్‌ కే పేరని.. నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తేనే ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అందరి ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే ఉందని స్పష్టం చేస్తూ తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో పార్టీ తీవ్ర సమస్యల్లో పడుతుందని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.

తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారవేస్తూ ఓటింగ్ అనంతరం సీఎం జగన్ ను కలిసే వచ్చానని,  వైసీపీ అధిష్టానం చెప్పిన వెంకటరమణకే ఎమ్మెల్సీ ఓటు వేసి గెలిపించానని స్పష్టం చేశారు. ‘టిక్కెట్టు ఇస్తే గెలిచి చూపిస్తా… ఇవ్వకపోతే నా దారి నేను చూసుకుంటా’… అంటూ తేల్చి చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles