ఢిల్లీ మద్యం స్కాం ఛార్జ్‌షీటులో కేజ్రీవాల్ తో పాటు కవిత!

Monday, March 18, 2024

రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం స్కామ్‌‌లో ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు, తెలంగాణ సీఎం కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుకూడా ఉండడం కలకలం రేపుతున్నది. పైగా, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరుకూడా ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాలలోని పెద్దలు ఈ కుంభకోణంలో కేజ్రీవాల్ తో చేతులు కలిపినట్లు స్పష్టం అవుతుంది. ఇప్పటికే, వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు ఈ కుంభకోణంలో అరెస్ట్ కూడా కావడం తెలిసిందే. ఇప్పటికే విచారించిన వారి జాబితాలో అలాగే ఆధారాలను ధ్వసం చేసిన వారిలో కూడా కవిత పేరును ప్రస్తావించారు.

ఢిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో జరిగిన సమావేశాల్లో కవిత పాల్గొన్నట్లుగా ఛార్జిషీట్‌లో ఈడీ అధికారులు తెలిపారు. మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ మద్యం స్కామ్‌ డబ్బులను గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ నిధులు సమకూర్చడంలో కవిత కీలక పాత్ర వచ్చిందిన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపణలు వెల్లడి చేస్తున్నాయి.

ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించామని వెల్లడించింది. మొత్తం 65 మందిని ప్రశ్నించామని, రూ. 100 కోట్లు చేతులు మారాయని తెలిపింది. నిందితులు హైదరాబాద్, ఢిల్లీలో పలు హోటళ్ళలో సమావేశమయ్యారని, నిందితులతో కవిత ఢిల్లీ ఒబెరాయ్ మెడిన్స్‌లో, హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సమావేశమయ్యారని ఈడీ తెలిపింది.

 హోల్‌సేల్ వ్యాపారంలో 12 శాతం లాభాలు రిటైల్ వ్యాపారంలో 185 శాతం లాభాలు వచ్చేలా మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని ఈడీ వెల్లడించింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సెక్రటరీ అరవింద్ పేరు కూడా ఈడీ ఛార్జ్‌షీట్‌లో ఉంది. కీలక నిందితుడు విజయ్ నాయర్ కేజ్రీవాల్ క్యాంపు ఆఫీసు నుండి కార్యకలాపాలు కొనసాగించారని ఈడీ వెల్లడించింది.

నిందితులకు కేజ్రీవాల్‌కు మధ్య విజయ్ నాయర్ అనుసంధాన కర్తగా వ్యవహరించారని తెలిపింది. సౌత్ గ్రూపు నుంచి రూ.100 కోట్లు ముడుపులు విజయ్ నాయర్ అందుకున్నారని, సౌత్ గ్రూపునకు, ఆప్ లీడర్లకు మధ్య ఒప్పందంలో భాగంగానే ఈ ముడుపులు అందుకున్నారని ఈడీ వెల్లడించింది. ఇండో స్పిరిట్‌లో సౌత్ గ్రూపునకు 65 శాతం భాగస్వామ్యం ఇచ్చారు.

సౌత్ గ్రూపులో కవిత, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, రాఘవ సభ్యులుగా ఉన్నారు. సౌత్ గ్రూపు తరపున అభిషేక్ బోయిన్ పల్లి, రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు ప్రతినిధులుగా వ్యవహరించారు. ముడుపులుగా అందిన డబ్బును గోవా ఎన్నికలకు ఆప్ నేతలు వాడారని ఈడీ వెల్లడించింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కారణంగా ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 2873 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ స్పష్టం చేసింది. నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేశారని, మొత్తం 170 ఫోన్లు వాడగా, అందులో 153 ఫోన్లను ధ్వంసం చేశారని, కేవలం 17 ఫోన్లు మాత్రమే రికవరీ చేశామని ఈడీ తెలిపింది.ఫోన్లు ధ్వసం చేసిన వారిలో సహితం కవితను ప్రముఖంగా పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఇప్పటికే నిందితులైన వ్యాపారవేత్త సమీర్‌ మహేంద్రు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్‌ నాయర్‌ ఇళ్లను అటాచ్ చేసింది. అలాగే దినేష్ అరోరా రెస్టారెంట్‌ను, అమిత్ అరోరా ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఈ కుంభకోణం కేసులో దక్షిణాది నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలకు హవాలా మార్గంలో ముడుపులు అందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పునరుద్ఘాటించింది.

బీఆర్ఎస్, ఆప్ పార్టీల మధ్య బంధానికి ఢిల్లీ లిక్కర్ స్కాం పునాదని ఈ ఛార్జ్ షీట్ వెల్లడి చేస్తున్నట్లు  బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా. కె. లక్ష్మణ్ ఆరోపించారు. తప్పు చేస్తే చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరని,  చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆయన హెచ్చరించారు. బిజెపికి వ్యతిరేకంగా కేసీఆర్, కేజ్రీవాల్ చేతులు కలపడానికి ఈ కుంభకోణమే సూత్రధారి అని కూడా ఆరోపణలు చేస్తున్నారు.

గత నెల ఖమ్మంలో బిఆర్ఎస్ జరిపిన మొదటి బహిరంగసభకు కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ లోని ఆప్ ముఖ్యమంత్రి మాన్ కూడా హాజరుకావడం తెలిసిందే. ఎన్నికలలో భారీఎత్తున నిధులు సమకూరుస్తున్నందునే కేజ్రీవాల్, హెచ్ డి కుమారస్వామి, అఖిలేష్ యాదవ్ వంటివారు కేసీఆర్ తో తరచూ వేదికలు పంచుకొంటున్నారనే విమర్శలు ఈ సందర్భంగా చెలరేగుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles