సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ నుంచి నాయకులు వలసలు వెళ్లిపోకుండా కాపాడుకోవడం అధినేతకు చాలా కష్టం. మళ్లీ కచ్చితంగా అయిదేళ్లు తర్వాత అధికారంలోకి వస్తుందని తెలిసినా కూడా.. అప్పటిదాకా ఓర్పు వహించలేని నాయకులు.. ప్రతిసారీ తక్షణ ప్రయోజనాలు మాత్రమే కోరుకునే నాయకులు అనేకమంది ఉంటారు.
వారు వలసలు వెళ్లిపోతూనే ఉంటారు. ఇది సాధారణంగా జరిగే పరిణామం. అలాంటిది.. వైఎస్సార్ కాంగ్రెస్ తరహాలో.. ప్రజలు కేవలం 11 సీట్లతో దారుణంగా తిరస్కరించిన పార్టీ మళ్లీ లేచి నిలబడుతుందని పార్టీ నాయకులు నమ్మడం కల్ల. అందుకే.. వేరే పార్టీల్లో ఎంట్రీకి అవకాశం లేకపోయినా సరే.. ఇప్పటిదాకా అనుభవించిన రాజకీయ జీవితం చాల్లే బాబూ అనే విరక్తి వారికి కలుగుతోంది. ఇప్పటికే చాలా మంది నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇంకా అనేకమంది వలసలకు, రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి నేపథ్యంలో పార్టీని కాపాడుకోవడం కోసం అధినేత రకరకాల కల్లమాటలు చెబుతూ కాలం గడపాల్సి వస్తుంది.
జగన్ చెబుతున్న అలాంటి మాటల్లో ముందస్తు ఎన్నికలు కూడా ఒకటి. కేంద్రం జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోందని, జమిలి ఎన్నికలు వస్తే.. రెండేళ్లలోనే ఎన్నికలు వచ్చేస్తాయని జగన్ అంటున్నారు. ఆయన అనుచర గణాలు కూడా ఈ వాదనను బలంగా చాటిచెబుతున్నాయి. ఇలాంటి అబద్ధాన్ని ప్రచారం చేయడం అనేది వారికి తప్పనిసరి అవసరం. ఎందుకంటే.. త్వరలోనే ఎన్నికలు వచ్చేస్తున్నాయి అంటే.. పార్టీనుంచి వెళ్లిపోదలచుకున్న నాయకులు కూడా మెదలకుండా ఉంటారు. దానికి తగినట్టు తమ అబద్ధానికి తోడుగా జగన్ మరియు ఆయన అనుచర గణాలు.. చంద్రబాబు సర్కారు మీద అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది.. ఈ క్షణంలో ఎన్నికలు వచ్చినా సరే.. వైసీపీ ఘనవిజయం సాధిస్తుంది అని ఊదరగొడుతూ గడుపుతున్నారు. ఇలాంటి మాటల ద్వారా నాయకులు పార్టీని వీడిపోకుండా కాపాడుకోవచ్చుననేది వారి వ్యూహం.
అయితే అలాంటి ముందస్తు ఎన్నికల ఆశల మీద, అబద్ధపు ప్రచారాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీళ్లు చిలకరించేశారు. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చినా సరే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం షెడ్యూలు ప్రకారం 2029లోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబునాయుడు చెప్పారు. ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని ఆయన వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం వద్ద చంద్రబాబునాయుడుకు ఉన్న ఇమేజి, సానుకూల వాతావరణం నేపథ్యంలో కేంద్రం ఆలోచన ఎలా ఉన్నదనే విషయంలో ఆయన మాటలకే ప్రజల్లో నమ్మకం ఎక్కువ. ఏ రకంగా చూసినా కూడా.. జగన్ కలగంటున్నట్టుగా రెండేళ్లలో జమిలి రూపంలో ముందస్తు ఎన్నికలు రావడం అసాధ్యం అని.. జమిలిగా నిర్వహించినా సరే.. సాధారణ ఎన్నికలు 2029లో జరుగుతాయనే వాదననే ప్రజలు నమ్ముతున్నారు.