అందరూ తమ భజన మాత్రమే చేయాలా జగన్ !

Saturday, April 20, 2024

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాదీవెన కింద దాదాపు 900 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసే కార్యక్రమాన్ని తాజాగా కొవ్వూరు లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగా తన సుదీర్ఘ ప్రసంగంలో ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రత్యర్థులను తిట్టిపోశారు. నిజానికి జగన్ మోహన్ రెడ్డి ఎన్నిసార్లు అయినా బటన్ నొక్కవచ్చు, ఆ పేరిట ఎన్ని చోట్ల అయినా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఆయన ఏ సందర్భంగా బటన్ నొక్కుతున్నారో, ఏ ఊర్లో పాల్గొంటున్నారో.. ఆయన వెనుక ఉన్న బ్యానర్ ను బట్టి తెలుసుకోవాల్సిందే తప్ప.. ఆయన ప్రసంగంలో ప్రధాన భాగం మొత్తం ‘కాపీ పేస్ట్’ మాదిరిగానే ఉంటుంది. ఈ ప్రసంగం కూడా అదే మాదిరిగా సాగిపోయింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ, లేదా, రాష్ట్ర వ్యవహారాల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ తన భజన మాత్రమే చేయాలని, తన వందిమాగధులుగానే పనిచేయాలని జగన్ కోరుకుంటున్నట్టుగా ఆయన ప్రసంగంలో మనకు ప్రతిసారీ అనిపిస్తూ ఉంటుంది.
రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలతో విరుచుకుపడడం అనేది ప్రతి నాయకుడూ చేసే పనే. కాకపోతే, పనిలోపనిగా తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని, విమర్శలు చేసే వారిని అందరినీ తూర్పారపట్టేస్తుంటారు. ఆ కోవలో మీడియా సంస్థల మీద మాటల దాడి చేస్తుంటారు. ఇది కూడా సహజ పరిణామమే అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన తన ప్రత్యర్థుల మీద నిందలు వేసే ప్రయత్నంలో భాగంగా మాట్లాడే మాటలు కొన్ని చాలా అర్థరహితంగా, కామెడీగా, అన్ని విషయాలూ తెలిసిన ప్రజలకు తమాషాగా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ చెప్పేవే అయినా వాటిని ఓసారి ప్రస్తావించుకుందాం.
‘‘మీ బిడ్డను ఓడించడానికి తోడేళ్లందరూ ఏకమవుతున్నారు. చంద్రబాబునాయుడుకు ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, టీవీ 5 ఉంది’’ అని జగన్ పదేపదే అంటుంటారు. అంతవరకు ఓకే. ‘‘నాకు అవేమీ లేవు’’ అని ముక్తాయిస్తారు. ఒకవేళ జగన్ మాటలు నిజమే అనుకున్నా చంద్రబాబుకు అనుకూలంగా వారు పనిచేస్తున్నారనుకుంటే, జగన్ కు అనుకూలంగా పనిచేయడానికి ఆయన సొంత పత్రిక సాక్షి, సొంత చానెల్ సాక్షి టీవీ, పెయిడ్ చానెల్ లాగా సేవలందించే ఎన్ టీవీ వంటివి ఉండనే ఉన్నాయి కదా. తన భజనకోసం అవి చాలవని, రాష్ట్రంలో ఉండే ప్రతి పత్రిక, ప్రతి చానెల్ తన భజన మాత్రమే చేయాలని జగన్ కోరుకుంటున్నారో ఏమో అర్థం కాదు. పైగా సాక్షి పత్రిక , టీవీ అనేవి ఆయన సొంత ఆస్తులు. ఆయన భజనపత్రాలు, ఆయన ప్రభుత్వానికి కరపత్రాలు. ఈ సంగతి తెలుగునేల మీద ప్రతి పసివాడికి కూడా తెలుసు. ‘నాకు ఏమీ లేవు’ అని ఆయన అంటే కామెడీగా అనిపిస్తుంది.
ఇక్కడ జరుగుతున్నది కులాల వార్ కాదు, క్లాస్ వార్. ధనికులకు- పేదలకు మధ్య యుద్ధం అని జగన్ అంటుంటారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా రికార్డుల్లో ఉన్న జగన్.. తాను పేదవాడినని, ధనవంతుల క్లాస్ తో ఎన్నికల్లో యుద్ధం చేస్తున్నానని చెప్పుకోవడం ఇంకా పెద్ద కామెడీ.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అబద్ధపు మాటలను ప్రతి మీటింగులోనూ చెబుతూ ఉంటారు. ఆ మీటింగులకు వచ్చిన వారిలో, టీవీ చానెళ్ల ద్వారా తన ప్రసంగాన్ని చూసిన వారిలో, కనీసం తమ సొంత కార్యకర్తల్లో కనీసం ఒక్క శాతమైనా ఇలాంటి మాటలను నమ్ముతున్నట్లు ఆయన అనుకోగలరా? ప్రతి విషయం, ప్రతి నాయకుడి మీద సర్వేలు చేయించే అలవాటు, వాటినే విశ్వసించే జాగ్రత్త తెలిసిన సీఎం జగన్.. ఈ విషయం మీద కూడా సర్వే చేయించుకుంటే ఆయనకు సత్యం బోధపడుతుందేమో.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles