సూళ్లూరుపేట చెంగాళమ్మ గుడి

Saturday, May 27, 2023
సూళ్లూరుపేట చెంగాళమ్మ గుడి

సూళ్లూరుపేట చెంగాళమ్మ గుడి

ఆంధ్ర ప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అత్యంత మహిమగల శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి  కొన్ని వందల సంవత్సరాలుగా పూజలందుకొంటున్నది.  శ్రీచెంగాలమ్మ. మరి ఈ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం..

పదో శతాబ్ద కాలంలో ‘‘శుభ గిరి” గా పిలవబడే ఈ గ్రామం ఒకప్పుడు గొల్లపల్లె. రోజూ మాదిరిగానే కొందరు పశువుల కాపరులు పశువులను మేతకు తోలుకెళ్ళారు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునేముందు సమీపంలోని పవిత్ర కళంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకుని కొట్టుకునిపోతూ, ఒక శిలను పట్టుకుని, ఆ ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు. ఒడ్డుకు చేరిన తరువాత చుస్తే అష్ట భుజాలతో వివిధ ఆయుధాలు ధరించ పాదాల క్రింద దానవుని దునుముతున్న దేవి విగ్రహం చూసిన పశువుల కాపరి గ్రామా పెద్దలకు విన్నవించగా,  గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకునివచ్చి ఒక రావి వృక్షం క్రింద తూర్పుముఖంగా ఉంచారు. మరుసటి రోజు నాడు చూడగా అమ్మవారి విగ్రహం నీటారుగా దక్షిణ ముఖముగా నిలబడి స్వయంభుగా మహిసాసుర మర్ధిని వెలసి ఉండడం చూసిన  గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.

అదే రోజు రాత్రి అమ్మవారు గ్రామ పెద్దకు కలలో కనబడి, తాను అక్కడే ఉండదలచానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. కాల క్రమంలో అదే “చెంగాలి” గా “చెంగాలి పేట”గా పిలవబడి, చివరకి ఆంగ్లేయుల పాలనలో సూళ్ళూరు పేటగా మారిందంటారు. ఊరి పేరు వెనక మరో కారణం కూడా చెబుతారు. ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద “సుడి మాను” తిప్పటం ఒక ఆచారంగా వస్తోంది. అదే సూళ్ళూరు పేటగా రూపాంతరం చెందినదని అంటారు.

ఆలయ విశేషాలు :

గర్భాలయంలో సర్వాలంకరణభూషితగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు. ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజ కులస్థులె పూజాదికాలు నిర్వర్తిస్తున్నారు. రోజంతా భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయం లోనికి ప్రవేశించి భంగపడ్డాడట. అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారట. కానీ స్వప్నంలో అమ్మవారు కనబడి ” నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు” అని తెలపడంతో వాటిని ప్రాంగణంలో ఒక చోట ఉంచారట. ఎండిపోయి, చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగింది. ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమా అన్నట్లుగా వృక్ష మూలంలో అమ్మవారి రూపం సాక్షత్కరించడం ఒక విశేషంగా పేర్కొనవచ్చును.

పూజలు ఉత్సవాలు :

ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవ కలశ అభిషేకం, మహా చండీ యాగం ఆర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్ధం నిర్వహిస్తున్నారు. సూళ్ళూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరికి ఏడు సంవత్సరాల కొకసారి మే – జూన్ నెలల మధ్య ఏడురోజులపాటు బ్రహ్మ్హోత్సవాలు జరుపుతారు. సుడిమాను ప్రతిష్ట, బలి హరణ తో ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. రెండవ రోజునుండి నాల్గవ రోజు వరకు సుడి మానుకు చక్రం, నల్ల మేక, పూల మాల, పాలవెల్లి, మనిషి బొమ్మ కట్టి సుళ్ళు తిప్పడం, మహిషాసుర మర్దన అంటే దున్నపోతు బొమ్మ తలను నరకడం జరుగుతుంది. అయిదో రోజున లోక కంటకుడైన మహిషాసురుని మహాకాళి సంహరించి లోకాలను కాపాడినందుకు గుర్తుగా ప్రజలు  కాళింది నదిలో అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహించి, ఆఖరి రోజున పరమేశ్వరిని పుష్ప పల్లకిలో ఊరేగిస్తారు. ఈ విధముగా ఏడు రోజులు అమ్మవారిని అశ్వ, సింహ, నంది ఇలా రోజుకో వాహనం మీద సూళ్లూరుపేట పట్టణంలో ఊరేగిస్తారు.

వివాహము, ఉపనయనం,పిల్లలకు తొలిసారి చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం లాంటివి జరుపుకోడానికి దేవాలయంలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. విశాల మండపము, వసతి గదులు అందుబాటులో ధరలతో దేవస్థానం ఏర్పాటు చేసింది. గణపతి నవ రాత్రులు, ఉగాది, మహాశివరాత్రి, నాగుల చవితి సందర్భాలలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు. దసరా నవ రాత్రులలో ఆలయ శోభ మరింతగా పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్త, మిళ నాడు రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తారు.

శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీ ఆలయం , నెల్లూరు పట్టణానికి వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న సూళ్ళూరు పేట లో ఉన్నది. అధిక శాతం చెన్నై వెళ్ళే రైళ్ళు సూళ్ళూరు పేటలో ఆగుతాయి. సూళ్లూరుపేటకు నెల్లూరు, తిరుపతి పట్టణాల నుండి బస్సులు ఉన్నాయి. సూళ్ళూరు పేటలో యాత్రీకులకు కావలసిన అన్ని సౌకర్యాలు లభిస్తాయి.

సూళ్లూరుపేట పట్టణ సమీపాన అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన శ్రీహరి కోట సతీష్ ధావన్  అంతరిక్ష కేంద్రం (షార్ ) ఉన్నది. షార్ యొక్క ప్రతి ప్రయోగానికి ముందు ఇక్కడ రాకెట్ యొక్క చిన్న నమూనాను ఉంచి పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. దీనికి ఇస్రో ఛైర్మన్ కూడా హాజరవడం జరుగుతుంది.

No tags for this post.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]
- Advertisement -

Latest Articles

- Advertisement -