సునీల్ కనుగోలు తెలంగాణాలో కాంగ్రెస్ ను గట్టెక్కిస్తారా!

Saturday, September 30, 2023

కర్ణాటకలో తన వ్యూహాలతో కాంగ్రెస్ ను సొంతబలంతో అధికారమలోకి తీసుకు రాగలగడంతో వ్యూహకర్త సునీల్ కనుగోలు గ్రాఫ్ అకస్మాత్తుగా పెరిగిపోయింది. దానితో ఇప్పుడు అందరి దృష్టి తర్వాత తెలంగాణాలో కాంగ్రెస్ లో కూడా ఆ పార్టీని గట్టెక్కిస్తారా? వాస్తవానికి వచ్చే డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాస్త్రాలలో ఆయన సేవలను కాంగ్రెస్ ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నా ప్రధానంగా తెలంగాణపై దృష్టి సారిస్తున్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి వ్యూహకర్తగా వ్యవహరించిన వారిలో ఒకరిగా ఉన్నారు. 2017 ప్రారంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలలో కనుగోలు అత్యంత విజయవంతమైన బీజేపీ ప్రచారాన్ని నిర్వహించారు. తమిళనాడులో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకే ‘నమక్కు నామం’ (మనం కోసం మనమే) ప్రచారాన్ని పర్యవేక్షించారు. ఆ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 39 పార్లమెంట్ స్థానాల్లో 38 స్థానాలను గెలుచుకుంది.

ఆ విధంగా ప్రశాంత్ కిషోర్ మాదిరిగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న వ్యూహకర్తగా పేరున్నప్పటికీ కర్ణాటకలో బిజెపి ఎత్తుగడలను చిత్తుచేసి, ఆ పార్టీకి ఘోర పరాజయం మూటగట్టగలగడంతో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా మారినట్లు కనిపిస్తున్నది. 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబధించి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ లో కూడా సభ్యుడిగా ఉన్నారు.

అవినీతి అంశంపై గత పదేళ్లుగా కాంగ్రెస్ ను నరేంద్ర మోదీ టార్జేట్ చేస్తూ వరుసగా ఎన్నికల విజయాలను కైవసం చేసుకొంటుండగా, అదే అంశంపై కర్ణాటకలో బిజెపిని ప్రజల ముందు దోషిగా అనిలబెట్టడంతో కనుగోలు వ్యూహాత్మక ఎత్తుగడలు అందరిని ఆకట్టుకొంటున్నాయి. తెలంగాణాలో కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ బృందం సలహాలపై ఆధారపడుతున్నారు. కేసీఆర్ ను ఏ విధంగా కాంగ్రెస్ దెబ్బతీసే విధంగా కనుగోలు ఎత్తుగడలు వేస్తారో ఇప్పుడు ఆసక్తిగా మారింది.

వాస్తవానికి తెలంగాణాలో కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్నప్పటికీ నాయకులే ఎవరిదారి వారిదిగా ఉంది. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సీనియర్లు అందరూ ఒక విధంగా సహాయ నిరాకరణ చేస్తున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కు కోవర్ట్ లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ ఆ విషయమై ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టడంలో కాంగ్రెస్ గాని, బిజెపి గాని చెప్పుకోదగిన విజయాలు సాధింపలేక పోతున్నాయి.

సునీల్ కనుగోలుకు తోడుగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహితం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారింపనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. తెలంగాణను గెల్చుకుంటే దక్షిణాదిన కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. అయితే అందుకు పార్టీ పరంగానే అనేక అవరోధాలు వెంటాడుతున్నాయి.

ఇటువంటి పరిస్థితులలో సునీల్ కనుగోలు కర్ణాటకలో మాదిరిగా ఇక్కడ కూడా కాంగ్రెస్ నేతలను ఒకటిగా వ్యవహరించే విధంగా ప్రయత్నం చేస్తారా? లేదా అవినీతి అస్త్రం ప్రయోగిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్నింటికీ మించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తామే అనే క్రెడిట్ ను కాంగ్రెస్ సొంతం చేసుకోవడంలో విజయం సాధింపలేక పోతున్నది.

కర్ణాటకలో సిద్దరామయ్య సునీల్ ను మీడియా సలహాదారునిగా నియమించి, కాబినెట్ హోదా ఇచ్చినా ఆయన సేవలను పూర్తిగా పార్టీకోసం ఇతర రాస్త్రాలలో రాబోయే ఎన్నికలలో ఉపయోగించుకోనున్నారు. ఇదివరకే సునీల్ నిర్వహింస్తున్న ఒక డేటా సెంటర్ పై తెలంగాణ పోలీసులు దాడి చేయడం, సునీల్ ను అరెస్ట్ చేసే ప్రయత్నం జరగడం గమనార్హం.

Related Articles

- Advertisement -
  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]
- Advertisement -

Latest Articles

- Advertisement -