సీబీఐ రెండో ఛార్జిషీట్ లో కనిపించని కవిత పేరు

Saturday, September 30, 2023

ఒక వంక ఢిల్లీ మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవితను నేడో, రేపో అరెస్ట్ చేస్తారంటూ తెలంగాణాలో బిజెపి నాయకులు పలువురు ప్రకటనలు  చేస్తుంటే, మరోవంక  తాజాగా సిబిఐ దాఖలు చేసిన అదనపు ఛార్జిషీట్ లో అసలు ఆమె పేరెక్కడ లేకపోవడం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తోంది. 

తమ పోరాటం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పైన గాని, బిఆర్ఎస్ పై కాదనే సంకేతం ఇవ్వడం కోసం బిజెపి లోపాయికారిగా కవితను ఈ కేసు నుండి తప్పించేందుకు సిద్ధపడిందా? అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న విధంగా `ఢిల్లీలో దోస్త్ – గల్లిలో కుస్తీ’ అన్నరీతిలో బీజేపీ – బిఆర్ఎస్ సంబంధాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏప్రిల్ 25న సిబిఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లుపై శనివారం  ఢిల్లీలోని  సిబిఐ ప్రత్యేక కోర్టు రౌస్ అవెన్యూ కోర్టులో  విచారణ జరిగింది. సీబీఐ తాజా ఛార్జిషీటులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడా చేర్చలేదు. కవితను అనేకసార్లు ప్రశ్నించినప్పటికీ కనీసం  ఇప్పటివరకు సీబీఐ ప్రశ్నించిన వారి జాబితాలో కూడా ఆమె పేరు లేకపోవడం విస్మయం కలిగిస్తుంది.

ఏప్రిలో 25న సీబీఐ అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. సుమారు 5 వేల 700 పేజీలతో రెండో ఛార్జిషీటును సీబీఐ దాఖలు చేసింది. మొదటి ఛార్జిషీట్ ను నవంబర్ 25న దాఖలు చేసింది. ఆ తరువాత డిసెంబర్ 11న కవితను హైదరాబాద్ లో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రశ్నించిన 89 మంది వివరాలను ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది.

ఈ ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమనాదీప్ ధల్‌లపై అభియోగాలు మోపుతూ సీబీఐ పేర్కొంది. అయితే ఈ ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు ఎక్కడా కనిపించలేదు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థల దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవా? లేకుంటే మరేదైనా రాజకీయ కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మే 4న 4వ అనుబంధ అభియోగ పత్రాన్ని ఈడీ దాఖలు చేసింది. 270 ప్రధాన పత్రాలు, సుమారు 2 వేల అనుబంధ పేజీలతో నాల్గవ అదనపు ఛార్జిషీటు దాఖలు చేసింది ఈడీ. మే 30న ఈడీ ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకోవడంపై ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వెలువరించనుంది.

రెండు ఛార్జిషీట్లలోనూ ప్రధానంగా సీబీఐ, ఈడీ మనీష్ సిసోడియాపైనే అభియోగాలు నమోదు చేశాయి. ఈడీ తాజా ఛార్జిషీట్ లోనూ కవితపై రోటిన్ అభియోగాలనే మోపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో సీబీఐ, ఈడీ అధికారులు కవితను ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ముందుగా ప్రకటించిన విధంగా కేసీఆర్ కర్ణాటక ఎన్నికల వైపే చూడకపోవడానికి, మహారాష్ట్రను దాటి ఇతర రాష్ట్రాల్లో బిఆర్ఎస్ విస్తరణ పట్ల ఇప్పటి వరకు ఆసక్తి చూపకపోవడానికి ఛార్జ్ షీట్ లలో కవిత పేరు లేకపోవడానికి సంబంధం ఉండనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

- Advertisement -
  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]
- Advertisement -

Latest Articles

- Advertisement -