సంజయ్ పై దాడితో ఆర్ఎస్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టిన పేరాల!

సంజయ్ పై దాడితో ఆర్ఎస్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టిన పేరాల!

బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను కించపరుస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో విభేదిస్తూ, వాటిని ఉపసంహరించుకోమని సూచిస్తూ దాడి చేసిన నిజామాబాద్ ఎంపీ డి అరవింద్ కు బహిరంగంగా పార్టీ సీనియర్ నేతపేరాల చంద్రశేఖర్‌రావు మద్దతు పలకడం బీజేపీలో కలకలం రేపుతున్నది.

కేవలం అరవింద్ చేసిన వాఖ్యలకు పరిమితం కాకుండా, సంజయ్ వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ, అతని వల్లన తెలంగాణాలో బీజేపీ తీవ్రంగా నష్టపుతున్నదని, పార్టీని అవసరాలకోసం వలసవచ్చినవారి పరం కావించడమే కాకూండా తీవ్రమైన అవినీతి చర్యలకు పాల్పడుతున్నారని దారుణమైన ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా  పేరాల చంద్రశేఖర్‌రావు చేసిన తీవ్ర వ్యాఖ్యలపైనా చర్చ జరుగుతున్నది. బండి సంజయ్‌ మాఫియా స్టెల్‌లో వ్యవహరిస్తున్నారని, అవినీతిని ప్రోత్సహిస్తున్నారని, ముందు నుంచి ఉన్న క్యాడర్‌ను కాకుండా ఆర్థిక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని కొత్తగా వచ్చినవాళ్లకు పదవులు ఇస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

 మైనింగ్ మాఫియా తదితరులను ముందు తీవ్రంగా విమర్శించడం, తర్వాత వారితో ఆర్ధిక లావాదేవీలతో రాజీపడటం చేస్తున్నాడంటూ ఆరోపించారు. పేరాల చేసిన ఆరోపణలను ఇప్పటివరకు బీజేపీలో నాయకులెవ్వరూ అధికారికంగా ఖండించనే లేదు.

అయితే కేవలం బిజెపి జాతీయ జాయింట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శివప్రకాష్ ఫోన్ చేసి అటువంటి ఆరోపణలను మీడియా ముందు ఉంచడం మంచిది కాదని, లిఖితపూర్వకంగా పంపితే అధిష్టానం పరిశీలిస్తోందని చెప్పారు. ఆయన సలహాపై తన ఆరోపణలను సోషల్ మీడియా పోస్టింగ్ నుండి చంద్రశేఖర్ తొలగించారు.

అయితే, పేరాల చంద్రశేఖర్  మూడు దశాబ్దాల పాటు ఎబివిపి, బీజేపీలలో ప్రచారక్ గా జాతీయ స్థాయిలో పనిచేయడం, ఈశాన్య రాష్ట్రాలలో చాలాకాలం బిజెపి వ్యవహారాలను పర్యవేక్షించడంతో ఆయన చేసిన ఆరోపణలు సంజయ్ కు గుడ్డిగా మద్దతు ఇస్తున్న ఆర్ఎస్ఎస్ నేతలను ఇరకాటంలో పడవేసిన్నట్లయింది.

ఎబివిపిలో ప్రస్తుత ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) దత్తాత్రేయ హొసబలేతో కలసి పనిచేయడం, బీజేపీలో పలువురు జాతీయ నాయకులతో కలసి పనిచేయడంతో ఆయన చేసిన ఆరోపణలను తీవ్రంగా కొట్టిపారవేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సంజయ్ పై వచ్చిన ఇటువంటి ఆరోపణల గురించి ఇప్పటికే హోమ్ మంత్రి అమిత్ షాకు నివేదించినట్లు తెలుస్తున్నది.

గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న లోటుపాట్ల గురించి చర్చించడంకోసం ప్రయత్నిస్తుంటే బండి సంజయ్ దాటవేస్తున్నాడని, తనతో మాట్లాడటానికి అసలు ఇష్టపడటం లేదని, కొందరు భజనపరులతో మొత్తం పార్టీని నడిపే ప్రయత్నం చేస్తున్నాడని పేరాల చంద్రశేఖర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, జాతీయ ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ వంటి వారి దృష్టికి కూడా తీసుకెళ్లినా వారు కూడా నిస్సహాయత వ్యక్తం చేయడంతో `షాక్ ట్రీట్ మెంట్’ ఇవ్వడం కోసమే సంజయ్ పై బహిరంగంగా తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు తెలుస్తున్నది. తెలంగాణాలో బిజెపి ప్రక్షాళనకు ఎవ్వరో ఒకరు పూనుకోవాలని ఉద్దేశ్యంతో చొరవ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]
- Advertisement -

Latest Articles