విజయసాయిరెడ్డి మనిషి కావడం విశాఖలో వైసీపీ కొంపముంచిందా!

Monday, December 4, 2023

విశాఖ పట్టణాన్ని రాజధానిగా చేస్తామని ప్రకటించినా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీకి ఓటు వేయకపోవడం,  వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ తన సమీప ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోవడం వైసీపీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. వైసీపీ అభ్యర్థి సీతంరాజు నిన్న మొన్నటి వరకు ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండటమే ఆ పార్టీ కొంపముంచిన ట్లు చెబుతున్నారు.

మొన్నటివరకు విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్రలో వైసిపిలో ఏకచత్రాధిపత్యం చెలాయించిన విజయసాయిరెడ్డిని కొంతకాలం క్రితం అక్కడి నుండి తప్పించడం, ఆ స్థానంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రావడంతో అధికారపక్షంలో అధికార కేంద్రాలు పూర్తిగా మారిపోయాయి.

వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు, అభ్యర్ధుల ఎంపికపై భిన్నాభిప్రాయాలు, ఉత్తరాంధ్ర బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించడం, అభ్యర్థి విజయసాయిరెడ్డి మనిషి కావడంతో పాటు విశాఖపట్నంలో టీడీపీకి మొదటి నుంచి ఉన్న స్థాన బలంతో తీవ్రమైన ప్రతికూలత ఎదుర్కోవలసి వచ్చింది.

విజయసాయిరెడ్డి హావా కొనసాగినప్పుడు ఆయన మనిషిగా స్థానికి వైసీపీ నేతలపై పెత్తనం చేసిన సీతారాజుకు పార్టీలో మిత్రులకన్నా శత్రువులే ఎక్కవులాగా ఉండటం కూడా టిడిపికి కలిసి వచ్చింది.

తన సొంత మనిషి పోటీ చేస్తున్నా, స్థానికంగా చెప్పుకోదగిన పరిచయాలు ఉన్నప్పటికీ తనను అక్కడినుండి తప్పించడంతో విజయసాయిరెడ్డి ఒక్కసారి కూడా వచ్చి సీతంరాజు విజయం కోసం ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. మరోవంక, సుబ్బారెడ్డి వంటి వారు సహితం విజయసాయిరెడ్డి మనిషి గెలుపొందడం పట్ల అంతగా ఆసక్తి చూపలేదు.

విశాఖ సౌత్‌కు చెందిన సీతంరాజు సుధాకర్‌ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే కాకుండా, 2019లో విశాఖ సౌత్ నుంచి పోటీ చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్ మరణించడంతో ఆ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. పైగా, ద్రోణంరాజు శ్రీనివాస్ తర్వాత విశాఖలో బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రతినిధిగా గుర్తింపు పొందే ప్రయత్నం చేశారు.

స్టీల్‌ ప్లాంట్‌కు అనుబంధ పరిశ్రమలు నిర్వహించే సుధాకర్‌ ఆర్ధికంగా బలంగా ఉండటం, సాయిరెడ్డి ఆశీస్సులు ఉండటంతో టిక్కెట్ ఖాయమని భావించారు. అయితే, అక్కడి నుండి ద్రోణంరాజుపై టిడిపి అభ్యర్థిగా గెలుపొందిన వాసుపల్లి గణేష్ ఇప్పుడు వైసిపితోనే ఉండటంతో అందుకు ఆటంకం ఏర్పడింది. పైగా, సీతంరాజు, గణేష్ ల మధ్య తీవ్ర విభేదాలు కూడా నెలకొన్నాయి.

అందుకనే, సీతంరాజును ఎమ్యెల్సీగా పంపితే ఆ నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత కలహాలు సమసిపోతాయని భావించి సీఎం వైఎస్ జగన్ చాలా ముందుగానే సీతంరాజును పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, టిడిపి వ్యూహాత్మకంగా చివరిలో తమ అభ్యర్హ్డిని మార్చి కాపు సామాజికవర్గంకు చెందిన, పుష్కలంగా వనరులు, పలుకుబడి గల అభ్యర్థిని నిలబెట్టడంతో వైసీపీకి అనుకోకుండా గట్టిపోటీ ఏర్పడింది. అందుకు ప్రభుత్వ వ్యతిరేకత తోడుకావడంతో పరాజయం తప్పలేదు.

మరోవంక, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ మాట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజమైందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. చతుర్ముఖ పోటీ కొనసాగినా  ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ చీలిపోలేదని ఓట్లసరళిని బట్టి చెప్పారు. అంటే వైసిపిని ఓడించడం కోసం ప్రజలు తమంతట తామే ఏకీకృతం కాబోతున్నారనే సంకేతం ఇచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles