మహా టీవీ, ఏబిఎన్‌ న్యూస్ ఛానళ్ల చర్చలపై హైకోర్టు ఆగ్రహం

Saturday, September 30, 2023

వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై జరిగిన వాదోపవాదాలపై రెండు ప్రముఖ టీవీ ఛానళ్లలో చెరిగిన చర్చా కార్యక్రమాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహా టీవీ, ఏబిఎన్‌ న్యూస్ ఛానళ్లలో మే26వ తేదీన వచ్చిన ప్రసారాల ఆధారంగా వాటిపై తగిన చర్యలు తీసుకోవడానికి ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని ధర్మాసనం సూచించింది.

న్యాయవ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించేలా, దాని స్వతంత్రతను ప్రశ్నించేలా కొన్ని ఛానళ్లలో జరుగుతున్న ప్రయత్నాలను అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ తీర్పులో జస్టిస్ లక్ష్మణ్ ప్రస్తావించారు. అవినాష్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో న్యాయస్థానానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ కొన్ని తెలుగు న్యూస్ ఛానళ్లలో చర్చా కార్యక్రమాలు నిర్వహించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆ రెండు తెలుగు టీవీ న్యూస్ ఛానళ్లలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కోర్టులో జరుగుతున్న వాదనలను వక్రీకరించి ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని బెయిల్‌ పిటిషన్‌ తీర్పులో పేర్కొన్నారు. టీవీల్లో చర్చల సందర్భంగా కొంతమందిని ఎంపిక చేసుకుని వారి ద్వారా న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం చేయిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

జడ్జిగా పనిచేస్తూ విధుల నుంచి సస్పెన్షన్‌కు గురై విధుల నుంచి తొలగించిన జడ్జి తనపై నేరుగా ఆరోపణలు చేశారని, “నగదు మూటలు అందుకున్నానని” ఆరోపించారని, ఆ చర్చలో పాల్గొన్న మరొకరు “చెయ్యండ్రా” అంటూ సంజ్ఞల ద్వారా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఆ చర్చలలో పాల్గొన్నవారి గురించి ప్రత్యేకంగా న్యాయమూర్తి ప్రస్తావించారు.

ఇటువంటి చర్యల ద్వారా న్యాయమూర్తిపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు దురుద్దేశాలను ఆపాదిస్తున్నారని న్యాయమృతి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభంగా నిలవాల్సిన పత్రికా వ్యవస్థపై తనకు ఎనలేని గౌరవం ఉందని చెబుతూ, అయితే, తమ అభిప్రాయాలను ఆలోచనలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని అది ప్రజాస్వామ్యబద్దంగా ఉండాలని స్పష్టం చేశారు.

కొందరి వ్యవహార శైలి వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట మసకబారే పరిస్థితి వచ్చిందని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న ఫుటేజీల ద్వారా ఆ చర్చలో చేసిన వ్యాఖ్యలు తాను పరిశీలించానని తెలిపారు. అందుబాటులో ఉన్న ఫుటేజీల ద్వారా ఆ చర్చలో చేసిన వ్యాఖ్యలు తాను పరిశీలించానని తెలిపారు.

అయితే, తన నిబద్దత, నిజాయితీపై చేసిన వ్యాఖ్యలు తనపై ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొంటూ, వాటి వల్ల తన వ్యక్తిత్వానికి వచ్చిన నష్టం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులతో న్యాయవ్యవస్థ పనితీరును రక్షించుకోవాల్సి ఉందని తెలిపారు.

కొన్ని మీడియా సంస్థల నుంచి న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ  న్యాయవ్యవస్థను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని, ఇలాంటి చర్యలపై చర్యలు తీసుకునే నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విడిచిపెడుతున్నట్లు చెప్పారు.

నిర్బయంగా విధులను నిర్వర్తిస్తానని చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకొంటూ, టీవీ ఛానళ్లలో వచ్చిన చర్చా కార్యక్రమాల వీడియోలను చీఫ్‌ జస్టిస్ ముందు ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీని జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు.

Related Articles

- Advertisement -
  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]
- Advertisement -

Latest Articles

- Advertisement -