చిరంజీవి కోసం అమిత్ షా ప్రయత్నం!

చిరంజీవి కోసం అమిత్ షా ప్రయత్నం!

కేంద్రమంత్రి అమిత్ షా తో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో భేటీ కావడం రాజకీయ, సినీ వర్గాల దృష్టిని ఆకట్టుకొంటుంది. మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ మాత్రమే అని బీజేపీ, చిరంజీవి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నప్పటికీ అంతకు మించి ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన నేపథ్యంలో రామ్ చరణ్‌కు అభినందనలు తెలిపేందుకే అమిత్ షా కలిసిన్నట్లు చెబుతున్నప్పటికీ ఆయన ప్రత్యేకంగా కలవడం గమనార్హం. ఆస్కార్ వచ్చాక తొలిసారిగా ఢిల్లీకి వచ్చిన రామ్ చరణ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో అమిత్ షా సత్కరించగా, కేంద్ర మంత్రిని చిరంజీవి శాలువాతో సత్కరించారు. సుమారు 15 నిమిషాల పాటు వీరి భేటీ కొనిసాగినట్లు తెలుస్తోంది. సహజంగానే వీరి మధ్య రాజకీయాలు సహితం చర్చకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.

ఇద్ద‌రు దిగ్గ‌జాలు అయిన చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌ని అమిత్‌షా ట్వీట్ చేశారు. అమిత్‌షాను చిరంజీవి, చ‌ర‌ణ్ క‌లిసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. అమిత్‌షా ఆత్మీయ స‌త్కారంపై చిరు ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఈ కార్య‌క్ర‌మంలో తాను భాగం కావ‌డం థ్రిల్లింగ్‌గా అనిపించింద‌ని చిరంజీవి ట్వీట్ చేశాడు.

ఈ సంద‌ర్భంగా భార‌త‌దేశ సంస్కృతి, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ గ‌ణ‌నీయంగా ప్ర‌భావితం చేస్తున్న‌ద‌ని అమిత్‌షా కొనియాడారు. నాటు నాటు పాట‌కు ఆస్కార్ రావ‌డంతో పాటు ఆర్ఆర్ ర్ సినిమా అద్భుత విజ‌యం సాధించినందుకు రామ్‌చ‌ర‌ణ్‌కు అమిత్‌షా అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

దేశం మొత్తమ్మీద బిజెపికి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన పెద్ద రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కావడం గమనార్హం. అక్కడ ఎంతగా ప్రయత్నం చేస్తున్నా జనంలోకి సందేశం తీసుకెళ్లగల ఓ నాయకుడిని సంపాదించలేక పోతున్నారు.

చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దగ్గరకు తీసిన్నప్పటికీ ఆయన తన సొంత రాజకీయ బాణీలో పోతున్నారు. బీజేపీలో తన పార్టీని విలీనం చేసేందుకు సుతారం ఇష్టపడటం లేదు. పైగా, బిజెపితో బంధంకన్నా టిడిపితో పొత్తు రాజకీయంగా కలసివస్తుందనే ఆలోచనలలో ఉన్నారు.

అందుకనే, చిరంజీవిని దగ్గరకు తీసుకో గలిగితే వెనుకనే పవన్ కళ్యాణ్ కూడా వస్తారనే ఆలోచనలు బిజెపి నేతలలో కలుగుతున్నాయి. 2009లో సొంతంగా ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి 18 శాతం వరకు ఓట్లు ఉమ్మడి రాష్ట్రంలో పొందిన చిరంజీవి ఆ తర్వాత కాంగ్రెస్‌ హయాంలో రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. కానీ 2014 నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలో కమలనాథులు చిరంజీవిని తమ వైపు తిప్పుకోవాలని, ఏపీలో ఆయన ప్రచారం చేస్తే బీజేపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారుగత ఏడాది  అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బహిరంగసభలో చిరంజీవిని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా ఆయనను బీజేపీలో చేరమని ఆహ్వానించారని, కానీ చిరంజీవి సున్నితంగా తిరస్కరించారని అప్పట్లో కధనాలు వచ్చాయి.

పలు సందర్భాలలో రాజకీయాలు తనకు సరిపడలేదని అంటూ తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటానని చిరంజీవి స్పష్టం చేస్తూ వస్తున్నారు. మరోవంక, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహితం చిరంజీవితో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటువంటి సమయంలో అమిత్ షా వచ్చి చిరంజీవితో భేటీ కావడం అందరి దృష్టిని ఆకట్టుకొంటోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]
- Advertisement -

Latest Articles