గుడ్డ కాల్చి రేవంత్ మొహాన వేసిన ఈటల!

Friday, September 20, 2024

రాజకీయాల్లో నిరాధార ఆరోపణలు, సాక్ష్యాలు దొరకని నిందలు చాలా సాధారణం! నిందలు వేసిన ప్రతివారూ కూడా.. నా వద్ద అన్ని రకాల సాక్ష్యాధారాలు ఉన్నాయి. సరైన సమయంలో వాటిని బయటపెడతాను అనే పడికట్టు పదాలతో మాయ చేస్తూ ఉంటారు. ఆ నిందలు తమ ప్రత్యర్థుల పరువు తీస్తే చాలునని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదేపర్వం నడుస్తోంది. బిజెపి నాయకుడు ఈటల గుడ్డ కాల్చి రేవంత్ మొహాన వేసేశారు. తన మొహానికి అంటిన మసిని కడుక్కోడానికి ఇప్పుడు రేవంత్ నానా పాట్లు పడుతున్నారు. ప్రమాణాలు చేస్తున్నారు.
మునుగోడు ఎమ్మెల్యే స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఓడించడానికి కాంగ్రెస్ కు భారాస ఆర్థిక సాయం చేసిందనేది ఈటల ఆరోపణ. సిటింగ్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బిజెపి తరఫున బరిలోకి దిగిన రాజగోపాల్ రెడ్డి ఆ ఎన్నికలో ఓడిపోయారు. భారాస గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి బిజెపి ఓట్లను చీల్చడం కోసం 25 కోట్ల రూపాయలు భారాస ఇచ్చిందని ఈటల ఆరోపించారు. శషబిషలేమీ లేకుండా — ఇది జగమెరిగిన సత్యం, దీనికి లెక్కలు ఉంటాయా, పత్రం ఉంటుందా, ఆధారాలు చూపిస్తారా? అంటే ఏం చెప్తాం.. అని తేల్చేశారు.
అసలే కాంగ్రెస్ పార్టీకి- భారాసకు మధ్య లోపాయికారీ స్నేహబంధం ఉన్నదని, బిజెపి వ్యతిరేకత అనే ఉమ్మడి ఎజెండాతో చెలరేగుతున్న ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం కూడా ఉన్నదని ఒక ప్రచారం నడుస్తోంది. భారాసతో స్నేహం అనే ప్రచారమే.. కాంగ్రెస్ పార్టీకి గొడ్డలిపెట్టులాగా మారుతోంది. ఆ ప్రచారం నుంచి బయటకు రావడానికి వారు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో మునుగోడు ఎన్నికల్లో డబ్బు పుచ్చుకున్నట్టుగా వచ్చిన ఆరోపణలుకూడా నష్టం చేస్తాయని రేవంత్ భయపడుతున్నట్టున్నారు.
సాధారణంగా ఇలాంటి విమర్శల విషయంలో దమ్ముంటే నిరూపించండి.. రాజకీయ సన్యాసం తీసుకుంటా.. నిరూపించలేకపోతే మీరు సన్యాసం తీుకోండి.. లాంటి ప్రతిసవాళ్లుంటాయి. రేవంత్ అలా కాకుండా.. బిజెపి వాళ్లు నమ్మే హైదరాబాదులోని భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చి తడిబట్టలతో ప్రమాణంచేస్తా, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. ఈటలను కూడా వచ్చి ప్రమాణం చేయమనండి అంటూ బేలగా పలుకుతున్నారు. ఇలాంటి విమర్శ రాగానే.. వెంటనే, కేసీఆర్ మీద విరుచుకుపడుతూ ఫైర్ కావాల్సిన రేవంత్.. ప్రమాణాలు చేస్తా నన్ను నమ్మండి.. నేను ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు.. లాంటి మాటలు అంటున్నారు. చూడబోతే.. ఈ విమర్శ ద్వారా ఈటల గుడ్డకాల్చి రేవంత్ మొహాన వేసేస్తే మసి కడుక్కోడానికి ఆయన కష్టపడుతున్నట్టుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles