అత్యద్భుతమైన పిడపర్తివారి జ్యోతిష్యం

Thursday, April 18, 2024

ఇదెప్పుడో బ్రిటిష్ వాళ్ళ పాలనలో దాదాపు 100 సంవత్సరాల క్రింద జరిగిన సంఘటన. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి స్వీయచరిత్ర నుండి కొన్ని భాగాలలోనిది.

ఈ సంఘటన జరిగింది విశాఖపట్నం జిల్లా కోర్టులో.

కోర్ట్ హాలులోకి జడ్జిగారు వచ్చారు. జడ్జిగారు యూరోపియన్. జడ్జిగారు రాగానే, కోర్టులోని వారందరు మర్యాదపూర్వకంగా లేచి నుంచున్నారు. జడ్జిగారు గద్దె ఎక్కి కూర్చున్నారు. ఇంతలో, బ్రహ్మవర్చస్సు మూర్తీభవిస్తున్న పిడపర్తి పెద్ద దక్షిణామూర్తి శాస్త్రిగారు కోర్ట్ హాల్లో ప్రవేశించగానే, కూర్చున్నవారు వెంటనే.మళ్ళీ లేచినుంచున్నారు.

అది చూసి చకితులైన జడ్జిగారు, ” యేం లేచారూ?” అని అడిగారు, వకీళ్ళను.
”అరుగో, వారు దయచేశారు. దైవజ్ఙులు వారు. దైవం తరువాత మాకంతటివారున్నూ. అలాంటివారికి ప్రత్యుత్థానం చెయ్యడం అనివార్యం మాకు” అని బదులుచెప్పారు వకీళ్ళు, తమ నాయకుని పరంగా.”అలాగా?” అన్నారు జడ్జి, జిజ్ఙాసతో. అతను యూరోపియను తానిది అర్థంచేసుకోలేడు; గాని మనస్సు గుబగుబలాడిపోయింది, తానూ లేచేశాడనుకోకుండా..
”వారి విశిష్టత యేమిటీ?” అనిన్నీ అడిగాడు, లేస్తూనే.

”సర్వజ్ఙులు వారు. ధర్మనిరతులు.. జ్యోతిశ్శాస్త్రం వారికి కరతలామలకం. వారు పంచాంగం చేస్తారు, దృక్సిద్ధంగా వుంటుం దది. జాతకాలు రాస్తారు, వొక్కక్షరమున్నూ బీరుపోదు. ప్రశ్నలున్నూ చెబుతారు, వారిమాట జరిగితీరుతుం” దన్నారు వకీళ్ళు.

జడ్జి బుద్ధి చమత్కృతం అయింది, దీంతో.
”ఒక్క ప్రశ్న అడగవచ్చునా?” అనడిగా డతను.
”అడగ” మన్నారు వకీళ్ళు, శాస్త్రిగారి యింగితం కనిపెట్టి.
” నేను కోర్టుకి బయలుదేరేటప్పడు మా ఆవు ఈనడానికి సిద్ధంగా వుంది. అది పెయ్యను పెట్టిందా, కోడెను పెట్టిందా? ఇది చెప్పమనండి.”
వారి సంస్కృతి అలాంటిది.
ప్రత్యక్షమే వారికి ప్రమాణం, మరి.
‘#’యదృశ్యం తన్నశ్యం” అంటే నమ్మరు వారు.
”కాగితం మీద రాసియిస్తాను. పైకి చెప్ప” నన్నారు శాస్త్రిగారు.
లగ్నం కట్టుకుని ఆలోచించి రాసి యిచ్చారు.
అది టేబులుమీద పెట్టుకుని నౌకర్నింటికి పంపాడు దొర.
శాస్త్రిగారి ముఖం మిక్కిలి గంభీరంగా భాసిస్తోంది; కాని మనం యేమయిపోతామో?” అంటూ ఆందోళనపడసాగారు, వకీళ్లు.
అటు నౌకరు వచ్చాడింతలో, ఇటు దొర కాగితం తీశాడు చురుగ్గా.
బెంచిక్లార్కు అనువదించాడు.”సెబాస్, సరిపోయింది” అన్నాడు దొర.
అన్నాడు కాని, వొక సందేహం పుట్టుకు వచ్చిం దతనికి – “మన మిటు నౌకర్ని పంపినట్లే, వకీళ్ళున్నూ తమ నౌకర్ని పంపివుండగూడదూ నా యింటికి?” అని.
సిద్ధాంతాలు ఎంత మంచివయినా అవి ప్రత్యక్షప్రమాణంతో రుజువయితే గాని ముందుకు వెళ్ళరు వారు. వారి భౌతిక విజయాల కిదే కారణం.
చూసిచూసి ”యింకొక టడగవచ్చునా?” అనడిగా డతను.
వకీళ్ళకి నిశ్చింత.
”వో, అడగవచ్చు” నన్నారు వారు.
”ఈ హాలుకి నాలుగు ద్వారాలున్నాయి. కోర్టుపని ముగించుకుని బయటికి వెళ్ళేటప్పుడు నేనే ద్వారంనుంచి వెడతానూ? ఇది రాయమనం” డన్నాడు దొర.
శాస్త్రిగారు రాసి వకీళ్ళ కిచ్చారు.
ఒక కవరులో వుంచి అతికించి అది దొర కందించారు వకీళ్ళు, ధీమాగా.
దొర జేబులో పెట్టుకున్నా డది. వ్యవహారం ప్రారంభం అయింది. అయిదింటికి పూర్తీ అయింది. అందరూ లేచారు.
వెనక ద్వారాన తన ఛాంబర్సులోకి వెళ్ళిపోవలసిన దొర అందరి మధ్యకీ వచ్చాడు,
హాల్లోకి.విషమసమస్య ప్రారంభ మయినట్టయింది, దాంతో.
నీరవు లయిపోయారు వకీళ్ళు; కాని దొర మాత్రం సావధానుడయినాడు, చురుగ్గా చూస్తూ.
. … …. …. ..
కాగా – “ఏగుమ్మాన వెడతాడో?” అనుకుంటూ ఆత్రంగా వున్నారు వకీళ్ళందరూ;
కాని వుడతలాగ వొక కిటికీలోనుంచి బయటకు దూకేశాడు దొర ”రండి” అని వకీళ్ళను పిలుస్తూ. అందరూ తెల్లపోయారు.
దొర కవరు తీశాడు, కవరులోనుంచి కాగితమూ తీశాడు, అన్యమనస్కంగా
ఆ కాగితం అతని చేతిలో వుండగానే ఆంగ్లంలోకి అనువాదం చేసి చదివేశాడు బెంచిక్లార్కు.
‘#వొక కృత్రిమద్వారంలోనుంచి బయటి కురుకుతావు” అని.
తుళ్ళిపడ్డారు జడ్జిగారు, ఎగిరి పడ్డారు వకీళ్ళు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles